సరికొత్త చరిత్ర.. ఆయనకు ఉరిశిక్ష! | Review Of 2019 : International Key Elements You Need To Know | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే క్లీన్‌చిట్‌.. అంతలోనే ఆయనకు షాక్‌!

Published Wed, Dec 25 2019 8:24 PM | Last Updated on Thu, Dec 26 2019 7:48 PM

Review Of 2019 : International Key Elements You Need To Know - Sakshi

ఎన్నికల్లో కుట్ర లేదని ఈ ఏడాది ప్రారంభంలో క్లీన్‌చిట్‌ పొందిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. అనూహ్యంగా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. గే వివాహాలను తైవాన్‌ చట్టబద్ధం చేయగా... స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని బ్రూనే నిర్ణయం తీసుకుంది. కెనడా పీఠంపై మరోసారి ట్రూడో కొలువుదీరగా.. బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతి పటేల్‌ కీలక బాధ్యతలు స్వీకరించారు. వీటితో పాటు ఈ ఏడాది చోటుచేసుకున్న మరెన్నో అంతర్జాతీయ పరిణామాలపై సాక్షిడాట్‌ కామ్‌ అందిస్తున్న సంక్షిప్త వార్తల సమాహారం.

జనవరి 5
హౌజ్‌లో.. 181 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
కొత్తగా కొలువుదీరిన అమెరికా ప్రతినిధుల సభ(హౌజ్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్‌, టర్బైన్‌) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్‌ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం.

జనవరి 5
అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్‌!
అమెరికా ప్రయోగించిన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించింది. హెచ్‌- 6కె అనే బాంబర్‌ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.  చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

జనవరి 8
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం
బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా ఆవామీ లీగ్‌ అధినేత షేక్‌ హసీనా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది కేబినెట్‌ మంత్రులుగా, 19 సహాయ మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా కేబినెట్‌లో కేవలం ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు.

అమెరికా దాడుల్లో అల్‌ ఖైదా బడావీ మృతి
ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్‌ అల్‌ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్‌ఖైదా తరఫున యెమెన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది.

జనవరి 11
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్‌ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ,  క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. కాగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు.

జనవరి 13
అమెరికా చరిత్రలో షట్‌డౌన్‌ రికార్డు
అమెరికా-మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్‌ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్‌ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్‌ క్లింటన్‌ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్‌ రికార్డును ట్రంప్‌ ప్రభుత్వం అధిగమించింది.

జనవరి 18
ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు
ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ చేశారు.  ప్రస్తుతం గేట్‌వే ఫర్‌ యాక్సెలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూక్లియర్‌ (గెయిన్‌) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్‌ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్‌ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్‌ సివిల్‌ లిబర్టీస్‌ ఓవర్‌సైట్‌ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌లో డెప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న బిమల్‌ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్‌ ప్రతిపాదించారు.

జనవరి 29
పాకిస్తాన్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!!
సుమన్‌ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్‌-షాదాద్‌కోట్‌ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. 

జనవరి 31
అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు
అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్‌ రాష్ట్రంలో ఒక ఫేక్‌ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో  దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు.

ఫిబ్రవరి 26
300 మంది ఉగ్రవాదుల హతం?
పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. బాలాకోట్, చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. 

మార్చి 26
అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని రాబర్ట్‌ ముల్లర్‌ విచారణ కమిటీ తేల్చింది. 

మార్చి 29
ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..!
ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. అదే విధంగా.. దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష అమలు చేయనుంది. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు.

ఏప్రిల్‌ 21
బాంబు పేలుళ్లతో రక‍్తమోడిన కొలంబో
శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది.

మే 17
గే వివాహాలను చట్టబద్ధం చేసిన తైవాన్‌
స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్‌ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. తైవాన్‌ అధ్యక్షురాలు సా యింగ్‌-వెన్‌ నేతృత్వంలోని డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.

జూన్‌ 6
థాయ్‌ ప్రధానిగా ప్రయూత్‌ చాన్‌ ఓచా
థాయ్‌లాండ్‌ నూతన ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్‌ చాన్‌ ఓచా(65) ఎన్నికయ్యారు. 2014లో ఇంగ్లక్‌ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్‌ ప్రయూత్‌ చాన్‌ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయూత్‌ చాన్‌ ఓచా నిలిచారు.   


జూలై 01
ఉత్తర కొరియాలో ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్‌)లోని పన్‌మున్‌జొమ్‌ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్‌ పర్యటన చరిత్రాత్మకమైంది.


జూలై 26
అమెరికాలో మళ్లీ మరణశిక్షల అమలు
దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది.

జూలై 26
బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతీ పటేల్‌
బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఎన్నికైన బోరిస్‌ జాన్సన్‌.. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్‌ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్(హోం మంత్రి), రిషి సునక్(ఆర్థిక శాఖ సహాయ మంత్రి), అలోక్‌ శర్మ (ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌)లకు కీలక బాధ్యతలు అప్పగించారు.


ఆగస్టు 15
భారత్‌ను హెచ్చరించిన ఇమ్రాన్‌ ఖాన్‌
కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విమర్శించారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్‌ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్‌లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. 

సెప్టెంబరు 7
ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్‌ ముగాబే(95) కన్నుమూశారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. సింగపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సెప్టెంబరు 11
ఇమ్రాన్‌కు ఐరాస షాక్‌
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌ వ్యవహారం భారత్‌-పాకిస్తాన్‌లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గటరీస్‌ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ స్పష్టం చేశారు.

సెప్టెంబరు 23
చరిత్రాత్మకంగా హౌడీ మోదీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్‌ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్‌ ట్రంప్‌ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు.


అక్టోబరు 23
కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో!
కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకొన్నారు. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్‌ డిస్ట్రిక్ట్స్‌కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ 121 డిస్ట్రిక్ట్స్‌లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్‌ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.


అక్టోబరు 29
ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీ హతం
ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్‌ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా బాగ్దాదీ చనిపోయాడని వాషింగ్టన్‌లోని  వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

నవంబరు 9
కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం
భారత్, పాకిస్తాన్‌లను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభమైంది. సిక్కుల గురువు గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని..  పాక్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.

నవంబరు 19
పాక్‌ అణు క్షిపణి పరీక్ష
భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్‌ క్షిపణి ‘షహీన్‌-1’ను పాక్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్‌ పరీక్షించింది.

నవంబరు 21
ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి
కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్‌ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. 

శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స
శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. 

నవంబరు 26
హాంకాంగ్‌ ఎన్నికల్లో చైనాకు షాక్‌
హాంకాంగ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన  155 మంది ఓడిపోయారు.

నవంబరు 29
శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల సాయం
శ్రీలంక అభివృద్ధికి భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు.


డిసెంబరు 4
అనూహ్యం: కమలా హ్యారిస్‌ అవుట్‌!
అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల అభ్యర్థిత్వ పోటీ నుంచి డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్‌  ప్రకటన చేశారు.

డిసెంబరు 9
మిస్‌ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ
ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్‌ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. 

డిసెంబరు 12
ఫిన్‌ల్యాండ్‌ కేబినెట్‌లో 12 మంది మహిళలు
ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ తన కేబినెట్‌లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్‌లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్నవారే. 

డిసెంబరు 15
మిస్‌ వరల్డ్‌గా జమైకా సుందరి
జమైకాకు చెందిన టోనీ-ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌-2019 కిరీటం దక్కించుకున్నారు. గత ఏడాది మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్‌.. టోనీ–ఆన్‌ సింగ్‌ తలపై మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్‌ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌ నిలిచారు.

డిసెంబరు 18
ముషారఫ్‌కు మరణశిక్ష
సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్‌ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు పాకిస్తాన్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్‌ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 

డిసెంబరు 20
ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. అనంతరం సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్‌ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement