భారత్‌పై అణుదాడి చేద్దామనుకున్నా
ముషార్రఫ్ వెల్లడి
దుబాయ్: 2002 ఏడాదిలో భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు.
అణ్వాయుధాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించగా ‘అప్పటికి క్షిపణులు అణ్వస్త్రాలతో సిద్ధంగా లేవు. ఆదేశాలు ఇచ్చి ఉంటే మరో రెండు రోజులకు సిద్ధమయ్యేవి. కానీ క్షిపణులకు వార్‌హెడ్లను అమర్చాలన్న ఆదేశాలను కూడా నేను ఇవ్వలేదు’ అని ముషార్రఫ్ చెప్పారు. 1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.