భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి? | Why Hatred Towards Hindus in Bangladesh | Sakshi
Sakshi News home page

భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి?

Published Sun, Dec 8 2024 12:23 PM | Last Updated on Sun, Dec 8 2024 1:11 PM

Why Hatred Towards Hindus in Bangladesh

న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన  బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం  మొదలుపెట్టింది.

మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక..
బంగ్లాదేశ్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహ భావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు. విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు.

హిందువులకు బెదిరింపులు
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆలయాన్ని, భక్తులను లక్ష్యంగా  చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకున్న  ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇస్కాన్‌పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని బెదించాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్‌ దాస్ మాట్లాడుతూ ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతాని​కో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్‌ అంతటా ఈ తరహా విద్వేషాలే చెలరేగుతున్నాయన్నారు.  ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఢాకా వీధుల్లో ప్రదర్శన
బంగ్లాదేశ్‌లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్‌ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్‌ను నిలిపివేశారు.

పరాకాష్టకు మత అసహనం
బంగ్లాదేశ్‌లోని ఛాందసవాదులు  ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి, విగ్రహాలను దహనం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబరు 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు.

పాక్‌కు చేరువవుతున్న బంగ్లాదేశ్ 
ఒకవైపు భారత్‌- బంగ్లాదేశ్ మధ్య పరస్పరం సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.  తాజాగా పాకిస్తాన్- బంగ్లాదేశ్‌లు  ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్దాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్- ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్  ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

క్షీణించిన భారత్‌- బంగ్లా సంబంధాలు
షేక్ హసీనాను అధికారం నుండి తొలగించి, మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్  ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్‌కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటుంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్‌లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.

ఇది కూడా చదవండి: రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement