సంపాదకీయం
పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి, తొమ్మిదేళ్లపాటు దేశాన్ని తన గుప్పిట బంధించిన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై ప్రత్యేక కోర్టులో ఎట్టకేలకు దేశద్రోహ నేరానికి సంబంధించిన అభియోగాలు ఖరారయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిగి, ముషార్రఫ్ దోషిగా నిర్ధారణ అయితే ఆయనకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడుతుంది. పాక్ చరిత్రలో ముషార్రఫ్‌ను పోలిన నియంత లెందరో కనబడతారు. వారంతా సైనిక దళాల చీఫ్‌లుగా పనిచేస్తూ బలప్రయోగంతో ప్రభుత్వాలను చెరబట్టినవారే. ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసంచేసినవారే. కానీ, ముషార్రఫ్‌లా వారెవరూ ఆ నేరానికి బోనెక్కలేదు. శిక్షలూ పడలేదు.
పాకిస్థాన్ వేర్వేరు సమయాల్లో మొత్తం 34ఏళ్లపాటు సైనిక నియంతల పాలనను చవిచూసింది. జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదు... ఆయనను ఒక హత్య కేసులో దోషిగా చేసి విచారణ తతంగాన్ని నడిపించి ఉరిశిక్ష అమలు చేయించినవాడు జనరల్ జియా ఉల్ హక్. ఆయన దేశాధ్యక్ష పదవిలో ఉండగానే విమాద ప్రమాదంలో మరణించాడు. అయితే మిగిలిన సైనిక నియంతలకూ, ముషార్రఫ్‌కూ తేడా ఉంది. వారంతా సైనిక దుస్తుల్లోనే దేశాన్నేలితే, ముషార్రఫ్ సివిలియన్ దుస్తుల్లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలకుడిగా కనబడే ప్రయత్నంచేశారు.
మళ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నిరుడు మార్చిలో ఆయన పాక్ గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్థాన్‌లో సైనిక పాలన ఉన్నా, ప్రజా ప్రభుత్వం ఉన్నా సైన్యానికుండే పలుకుబడి అపారమైనది. వారికి అసంతృప్తి కలిగించేలా వ్యవహరించేందుకు అధికారంలో ఉన్నవారు సిద్ధపడే అవకాశం లేదు. తాను 1999లో కూలదోసిన నవాజ్ షరీఫే మళ్లీ పరిపాలకుడిగా ఉంటున్నా, ఆయన తనపై పాత కక్షలను తీర్చుకునే అవకాశం లేకపోలేదన్న అనుమానం ఉన్నా... ముషార్రఫ్ తిరిగివచ్చే సాహసం చేసింది అందుకే. కానీ, ఆయన అనుకున్నది ఒకటైతే అయింది మరోటి. ఇప్పటికే ఆయనపై పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యకేసు, బలూచిస్థాన్ జాతీయ నాయకుడు అక్బర్ బుగ్తీ హత్యకేసు ఆరోపణలున్నాయి. అయితే, ముషార్రఫ్‌పై ఇప్పుడు ఖరారైన అభియోగాలను జాగ్రత్తగా గమనిస్తే అందులోని లొసుగులు వెల్లడవుతాయి. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సంబంధించిన అభియోగం అందులో లేదు. 2007 నవంబర్‌లో రాజ్యాంగాన్ని రద్దుచేసి దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు...సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అక్రమంగా పదవులనుంచి తొలగించి, నిర్బంధించడం వగైరా అభియోగాలు మాత్రమే ఉన్నాయి. అంతకు ఆరేళ్లముందు ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయకుండా ఇవేవీ ముషార్రఫ్‌కు సాధ్యమయ్యేవి కాదు.
అయినా ఎందుకనో అభియోగాల్లో ఆ ప్రస్తావన లేదు. దేశద్రోహ నేరం కూడా ఒక్క ముషార్రఫ్‌పైనే ఉన్నది. వివిధ స్థాయిల్లోని సహచర సైనికాధికారుల సహాయసహకారాలు లేకుండా ముషార్రఫ్ ఒక్కరే అధికారాన్ని కైవసం చేసుకోవడం, దాన్ని చెలాయించడం సాధ్యంకూడా కాదు. కానీ, చిత్రంగా ఇతర అధికారులపైగానీ, రిటైర్డు అధికారులపైగానీ దీనికి సంబంధించిన కేసులు పెట్టలేదు. కేసును ముషార్రఫ్‌కు మాత్రమే పరిమితం చేయడంద్వారా సైన్యంనుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా నవాజ్ షరీఫ్ జాగ్రత్తపడ్డారు. ముషార్రఫ్‌కు ఇప్పటికీ సైన్యంనుంచి గట్టి మద్దతే ఉంది. ఆయన ఏదో ఒక దశలో దీన్నుంచి బయటపడి సురక్షితంగా దేశం విడిచి వెళ్తారన్న విశ్వాసం సైన్యంలో ఉంది. బహుశా అందువల్లే కావొచ్చు జరుగుతున్న తతంగాన్నంతా సైన్యం మౌనంగా వీక్షిస్తున్నది. కేసులపై విచారణ మొదలయ్యాక కోర్టు ముందు హాజరుకావడం ముషార్రఫ్‌కు ఇది రెండోసారి. సోమవారంనాటి విచారణ సందర్భంగా ఆయన తనను తాను గట్టిగా సమర్ధించుకున్నారు. దేశం కోసం రెండు యుద్ధాల్లో పోరాడి, 44 ఏళ్లపాటు సైన్యానికే జీవితాన్ని అంకితం చేసిన తనపై దేశద్రోహ నేరారోపణలు చేయడమేమిటని ఆయన నిబ్బరంగా ప్రశ్నించారు. కనుక ఈ కేసు విచారణ చివరి వరకూ ఇదే తరహాలో వెళ్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు.
నవాజ్ షరీఫ్‌ను 2000 సంవత్సరంలో ముషార్రఫ్ నిర్బంధంలో ఉంచినప్పుడు మధ్యవర్తిత్వంవహించిన సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పుడు ముషార్రఫ్‌ను రక్షించడానికి తెరవెనుక మంతానాలు సాగిస్తోంది. దేశం విడిచివెళ్లడానికి వీల్లేని వ్యక్తుల జాబితానుంచి ఆయన పేరు తొలగించాలని ఒత్తిడి తెస్తోంది. అయితే, ముషార్రఫ్‌పై న్యాయవ్యవస్థ ఆగ్రహంతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టుకునేందుకు నవాజ్ షరీఫ్ సిద్ధంగా లేరు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దుబాయ్‌లో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న 94 ఏళ్ల తన తల్లిని చూసి మళ్లీ వస్తానని ముషార్రఫ్ చెబుతున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని హామీ ఇస్తున్నారు. కానీ, పాకిస్థాన్ గత పాలకుల చరిత్ర గమనించి నవారెవరూ ఈ హామీని విశ్వసించలేరు. ఏదేమైనా ముషార్రఫ్ ఇప్పుడు ఒక సంకట స్థితిలో పడ్డారు. ఉగ్రవాదులొకపక్క... ప్రభుత్వమూ, న్యాయవ్యవస్థ మరోపక్క వెంటాడుతుంటే దిక్కుతోచకుండా అయ్యారు. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసిన ఒక నియంతకు ఈ స్థితి ఏర్పడటం పాక్ చరిత్రలో ఇదే ప్రథమం. భవిష్యత్తు కుట్రలను నివారించే స్థాయిలో ఈ విచారణ సజావుగా పూర్తయి ముషార్రఫ్‌కు శిక్షపడుతుందా లేక ఇదంతా ప్రహసనంగా మిగిలిపోతుందా అన్నది వేచిచూడాలి.