ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు.
భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్‌కర్‌నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది.
విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్‌లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment