leakage of data
-
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఫేస్బుక్ వాడుతున్నారా..? జర జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశంలో ఫేస్బుక్ వాడే వినియోగదారులు తమ అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్టీ ఇన్) సూచించింది. ఇటీవలే ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన డేటా దాడి 61 లక్షల భారతీయుల అకౌంట్లపై పడిన సందర్భంగా ఏజెన్సీ ఈ సూచన చేసింది. ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నకొద్దీ యూజర్ల అకౌంట్లు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయని, ఇలాంటప్పుడు యూజర్ల డేటాను వారికి తెలియకుండానే సేకరించడం జరుగుతుందని ఏజెన్సీకి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ప్రొఫైల్ సమాచార లీకేజీ భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలా లీకయ్యే సమాచారంలో ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ ఐడీలు, పేర్లు, వృత్తి వివరాలు, ఫోన్ నంబర్లు, జన్మతేదీలు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య సమాచారం, పాస్వర్డ్స్ వివరాలు లేవని ఫేస్బుక్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది సమాచారం(61 లక్షలమంది భారతీయుల సమాచారంతో సహా) సైబర్ క్రిమినల్ ఫోరమ్స్‌లో ఉచితంగా లభిస్తోందని ఏజెన్సీ తెలిపింది. ఈ లీకేజీ కారక టెక్నాలజీ ఫీచర్‌ను సరిదిద్దామని ఫేస్బుక్ పేర్కొంది. లీకైన సమాచారం మొత్తం 2019కి పూర్వపు సమాచారమని తెలిపింది. ( చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ ) -
10 కోట్ల కార్డుల వివరాలు లీక్!
న్యూఢిల్లీ: డిజిటల్ వేదికలపై కస్టమర్ల కీలక సమాచారం ఎద్ద ఎత్తున చోరీకి గురైంది. ఏకంగా 10 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డుల కీలక వివరాలను ‘జస్ పే’ వేదిక నుంచి తస్కరించిన సైబర్ నేరగాళ్లు వాటిని డార్క్‌వెబ్‌లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు!. ఈ విషయాన్ని సెక్యూరిటీ అంశాల పరిశోధకుడు రాజశేఖర్ రాజహారియా వెలుగులోకి తీసుకొచ్చారు. డార్క్‌వెబ్‌లో ఈ సమాచారం అమ్మకానికి పెట్టడాన్ని ఆయన కనిపెట్టనట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జస్పే.. ప్రముఖ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మేక్ మై ట్రిప్, ఎయిర్టెల్, ఉబెర్, స్విగ్గీ తదితర కంపెనీలకు లావాదేవీలను ప్రాసెస్ చేసే సేవలను అందిస్తోంది. దీంతో 10 కోట్ల కార్డు వివరాలు బహిర్గతం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 2017 మార్చి నుంచి 2020 ఆగస్ట్ మధ్య ఈ వివరాలు చోరీకి గురి కాగా, ఇటీవలే ఒకే విడత ఈ మొత్తాన్ని విక్రయించినట్టు భావిస్తున్నారు. అన్ని వివరాలూ.. కార్డు కంపెనీ (వీసా/మాస్టర్‌కార్డ్, ఏఎమ్ఎక్స్), కార్డు ఎక్స్పైరీ, కార్డుపై ఉండే మొదటి ఆరు, చివరి నాలుగు అంకెలు, కార్డు రకం (క్రెడిట్ లేదా డెబిట్), కార్డుపై పేరు, దాన్ని మంజూరు చేసిన బ్యాంకు, కార్డ్ ఫింగర్‌ప్రింట్, కార్డు ఐఎస్ఐఎన్.. ఇలా కార్డుల్లోని 16 ఫీల్డ్స్ వివరాలు, లావాదేవీల సమాచారం లీక్ అయినట్టు భావిస్తున్నారు. అలాగే, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, పేర్లు కూడా తరలిపోయాయి. ఈ వివరాలు లావాదేవీల సమయంలో ఈ కామర్స్ సంస్థల నుంచి జస్పేకు వెళుతుంటాయి. వీటి ఆధారంగా జస్పే లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. మోసాలకు ఆస్కారం.. ఇలా చోరీ చేసిన సున్నిత సమాచారం ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు సందేహిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా యూజర్లకు కాల్ చేసి బ్యాంకు నుంచో లేక జస్పే లేక అమెజాన్ నుంచి చేస్తున్నట్టు నమ్మించి కావాల్సిన ఇతర సమాచారం కూడా తీసుకోవడం ద్వారా లావాదేవీలను చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. కార్డుకు సంబంధించి తమ వద్దనున్న వివరాలు చెప్పడం ద్వారా నమ్మించే ప్రయత్నం చేయవచ్చంటున్నారు. కార్డు వివరాలు లీక్ కాలేదు: జస్పే ‘‘2020 ఆగస్ట్ 18న మా సర్వర్లపై అనధికార దాడికి ప్రయత్నం జరగ్గా.. గుర్తించి అడ్డుకున్నాము. అయితే కార్డు నంబర్లు లేదా ఆర్థిక వివరాలు లేదా లావాదేవీల వివరాలు ఉల్లంఘనకు గురి కాలేదు’’ అంటూ జస్పే గతంలోనే ఓ ప్రకటన రూపంలో స్పష్టం చేసింది. భద్రత ఎలా..? కార్డుపై మూడు నంబర్ల సీవీవీ అన్నది ఎంతో సున్నితమైనది. లావాదేవీ ప్రాసెస్‌కు ముందు దీన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను కూడా ఉంటోంది. అంటే కార్డుదారు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తర్వాతే అది ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ హ్యాకర్ తనకు లభించిన సమాచారంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చేస్తే అప్పుడు జరగాల్సిన నష్టాన్ని అడ్డుకోలేము. కనుక ప్రతీ ఆన్లైన్ లావాదేవీ కోసం ప్రత్యేకంగా వర్చువల్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. -
ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యిందా.. జరభద్రం!
ట్విట్టర్ అకౌంటు ఉండటం ఒక ఎత్తయితే.. దాన్ని వెరిఫై చేయించుకుని అధికారికంగా 'బ్లూ టిక్' పెట్టించుకోవడం మరో ఎత్తు. సోషల్ మీడియాలో ప్రెజెన్స్ చూపించుకోవడంతో పాటు, తమకు సంబంధించి ఇదే సరైన అకౌంట్ అని, మిగిలినవన్నీ ఫేక్ అకౌంట్లని చెప్పుకోడానికి ఈ రకంగా వెరిఫై చేయించుకుంటారు. కానీ, ఇలా వెరిఫై చేయించుకున్న లక్షలాది ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తాము బయట పెట్టేస్తామని వికీలీక్స్ హెచ్చరించింది. మొత్తం అన్ని వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు, వాళ్ల కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక అంశాలు, సంబంధాలు అన్నింటితో ఒక ఆన్లైన్ డేటాబేస్ ఏర్పాటుచేస్తామని వికీలీక్స్ ఒక ట్వీట్లో తెలిపింది. అయితే దాన్ని ట్విట్టర్ వెంటనే తీసేసింది. 'వికీలీక్స్ టాస్క్‌ఫోర్స్' అనే పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంటుద్వారా చెప్పిన ఈ వివరాలను న్యూయార్క్ డైలీ న్యూస్ బయటపెట్టింది. మొదటి ట్వీట్‌ను డిలీట్ చేసిన వెంటనే అదే అకౌంటుతో మరో ట్వీట్ కూడా చేశారు. అయితే ఈసారి తమ వ్యాఖ్యలలో ఘాటు కాస్తంత తగ్గించారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వివరాలను బయట పెట్టాలనుకుంటున్నామని, ఎవరైనా సూచనలిస్తారా అని ఆ ట్వీట్లో తెలిపారు. ట్విట్టర్ అధికారికంగా గుర్తించిన అకౌంట్లను వెరిఫైడ్ అకౌంట్లు అంటారు. వాటికి ట్విట్టర్ ఐడీ పక్కన నీలిరంగు సర్కిల్లో ఒక టిక్ మార్క్ వస్తుంది. అయితే, ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం తమ నిబంధనలకు విరుద్ధమని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వికీలీక్స్ చేసిన హెచ్చరికపై బ్రిటిష్ నటుడు ఎతాన్ లారెన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరో ఒకరు మీ ఇంట్లోకి చొరబడిపోయి మీ సోఫా కుషన్లన్నింటినీ అటూ ఇటూ మార్చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.