ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యిందా.. జరభద్రం!
ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యిందా.. జరభద్రం!
Published Sat, Jan 7 2017 2:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM
ట్విట్టర్ అకౌంటు ఉండటం ఒక ఎత్తయితే.. దాన్ని వెరిఫై చేయించుకుని అధికారికంగా 'బ్లూ టిక్' పెట్టించుకోవడం మరో ఎత్తు. సోషల్ మీడియాలో ప్రెజెన్స్ చూపించుకోవడంతో పాటు, తమకు సంబంధించి ఇదే సరైన అకౌంట్ అని, మిగిలినవన్నీ ఫేక్ అకౌంట్లని చెప్పుకోడానికి ఈ రకంగా వెరిఫై చేయించుకుంటారు. కానీ, ఇలా వెరిఫై చేయించుకున్న లక్షలాది ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తాము బయట పెట్టేస్తామని వికీలీక్స్ హెచ్చరించింది. మొత్తం అన్ని వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు, వాళ్ల కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక అంశాలు, సంబంధాలు అన్నింటితో ఒక ఆన్‌లైన్ డేటాబేస్ ఏర్పాటుచేస్తామని వికీలీక్స్ ఒక ట్వీట్‌లో తెలిపింది. అయితే దాన్ని ట్విట్టర్ వెంటనే తీసేసింది. 'వికీలీక్స్ టాస్క్‌ఫోర్స్' అనే పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంటుద్వారా చెప్పిన ఈ వివరాలను న్యూయార్క్ డైలీ న్యూస్ బయటపెట్టింది.
మొదటి ట్వీట్‌ను డిలీట్ చేసిన వెంటనే అదే అకౌంటుతో మరో ట్వీట్ కూడా చేశారు. అయితే ఈసారి తమ వ్యాఖ్యలలో ఘాటు కాస్తంత తగ్గించారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వివరాలను బయట పెట్టాలనుకుంటున్నామని, ఎవరైనా సూచనలిస్తారా అని ఆ ట్వీట్‌లో తెలిపారు. ట్విట్టర్ అధికారికంగా గుర్తించిన అకౌంట్లను వెరిఫైడ్ అకౌంట్లు అంటారు. వాటికి ట్విట్టర్ ఐడీ పక్కన నీలిరంగు సర్కిల్‌లో ఒక టిక్ మార్క్ వస్తుంది.
అయితే, ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం తమ నిబంధనలకు విరుద్ధమని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వికీలీక్స్ చేసిన హెచ్చరికపై బ్రిటిష్ నటుడు ఎతాన్ లారెన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరో ఒకరు మీ ఇంట్లోకి చొరబడిపోయి మీ సోఫా కుషన్లన్నింటినీ అటూ ఇటూ మార్చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.
Advertisement