
ఆ ఉగ్రవాదులకు శిక్షణ
- ఇచ్చింది ‘రా’నే!: ముషార్రఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పెషావర్‌లో మంగళవారం తాలిబాన్ దాడిలో 148 మంది చిన్నారులు మరణించిన ఘటనపై స్పందిస్తూ.. ఆ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు భారత దేశ నిఘాసంస్థ ‘రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్)’ శిక్షణనిచ్చిందని ఆరోపించారు.
‘మౌలానా ఫజ్లుల్లా ఎవరు? తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ కమాండర్. అఫ్ఘానిస్థాన్‌లో ఉంటాడు. అఫ్ఘానిస్థాన్‌లోని గత కర్జాయ్ ప్రభుత్వం, భారతదేశ నిఘా సంస్థ ‘రా’.. పాక్‌లో దాడులు చేసేందుకు అతడికి సహకారం అందించాయనేందుకు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది’ అని ఆంగ్ల వార్తాచానెల్ సీఎన్‌ఎన్‌ఐబీఎన్‌కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పెషావర్ దాడి వెనుక భారత్ కుట్ర ఉందని జమాత్‌ఉద్‌దవా అధినేత హఫీజ్ సయీద్ ఆరోపించారు.