'లాడెన్, తాలిబన్లు.. మాకు హీరోలు'
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లు వంటి ఉగ్రవాదులను పాకిస్థాన్ హీరోలుగా భావించేదని ముష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చినట్టు అంగీకరించారు.
'1990లో కశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆ సమయంలో లష్కరే తోయిబా వంటి 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వారికి మద్దతు ఇచ్చి, కశ్మీర్లో పోరాడేందుకు శిక్షణ కూడా ఇచ్చాం. హఫీజ్ సయీద్, లక్వీ వంటి ఉగ్రవాదులు హీరోలుగా చెలామణి అయ్యారు. అనంతరం పాకిస్థాన్లో మతతత్వ పోరాటం ఉగ్రవాదంగా మారింది. ఇప్పుడు సొంతవారినే చంపుతున్నారు. దీన్ని నియంత్రించాలి. తాలిబన్లకు శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పంపించాం. తాలిబన్లు, లాడెన్, జవహరి వంటి ఉగ్రవాదులు అప్పట్లో హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు' అని ముష్రాఫ్ చెప్పారు.