పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ)ని వేడుకుంటోంది.
పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్‌లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్‌పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.
తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్‌ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment