
పర్వేజ్ ముషరాఫ్ (పాత చిత్రం)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషార్రఫ్ పాస్‌పోర్టును రద్దు చేయాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది.
ముషార్రఫ్ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజ్యద్రోహం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ముషరాఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఉండాలనే లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డేటా బేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్టు డైరెక్టరేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించాయి. కోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ముషార్రఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కొల్పోవడంతోపాటు, బ్యాకింగ్ సేవలను వినియోగించుకోలేరు.