
బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు.. బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పేరుతో అధికారులు ఆమెను నిద్రపోవడం లేదని ఆమె తరఫు న్యాయవాది బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ పేరుతో నా క్లయింట్ రన్యారావును డీఆర్‌ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదు. అరెస్టైన సమయంలో తనకున్న హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని. హత్యా అభియోగాలు దాఖలైన కేసుల్లోనూ నిందితులు మహిళలైతే బెయిల్ లభించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు నా క్లయింట్ కూడా బెయిల్ పొందడానికి అర్హురాలే. కాబట్టి ఆమెకు ఊరట ఇవ్వాలని వాదనలు వినిపించారాయన.
మార్చి 3వ తేదీన.. దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ కెంపగౌడ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు రన్యారావు దొరికిపోయారు. నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలో 14 కేజీల బంగారాన్ని దాచారు. అయితే.. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె.. దానిని తీసుకొని తాను స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు వెల్లడించినట్లు తేలింది. ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్లు వెల్లడైందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తన అరెస్ట్ మెమోలో పేర్కొంది.
అలాగే.. స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment