పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు.
ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.