'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు'
కరాచీ: కష్టకాలంలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తనకు ఎంతో సాయం చేశారని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. రహీల్ షరీఫ్ వల్లే తాను దేశం నుంచి సురక్షితంగా బయడపడగలిగానని ఓ మీడియా టాక్ షో సందర్భంగా వెల్లడించారు. కోర్టులు, ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తగ్గించి, తనకు అండగా నిలబడ్డారని కొనియాడారు. షరీఫ్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టకముందు తాను ఆ పదవిలో కొనసాగానని, ఆ సమయంలో అతడికి తాను బాస్‌గా వ్యవహరించానని ముషార్రఫ్ గుర్తుచేసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.
షరీష్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి గత నెలలో రిటైరైన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఖమర్ జావెద్ బజ్వా పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా పాక్ లో ఏదైనా జరగాలంటే ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ సాయం ఆవశ్యకమని ఆర్మీ మాజీ బాస్ ముషార్రఫ్ పేర్కొన్నారు. పాక్ సుప్రీంకోర్టు తనపై విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించగా, షరీఫ్ జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా గత మార్చిలో తాను విదేశాలకు వెళ్లగలిగానని ముషార్రఫ్ వివరించారు. 2007లో ఎమర్జెన్సీ రూల్, జడ్జిలను అరెస్ట్ చేయడం వారి అధికారాలు తగ్గించడంపై ఆ తర్వాత కాలంలో చిక్కులు ఎదుర్కున్నారు.