raheel sharif
-
షకీల్ కొడుకు రాహిల్ కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి మరో కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రాహిల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రాహిల్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న షకీల్, రాహిల్‌కు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. -
'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు'
కరాచీ: కష్టకాలంలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తనకు ఎంతో సాయం చేశారని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. రహీల్ షరీఫ్ వల్లే తాను దేశం నుంచి సురక్షితంగా బయడపడగలిగానని ఓ మీడియా టాక్ షో సందర్భంగా వెల్లడించారు. కోర్టులు, ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తగ్గించి, తనకు అండగా నిలబడ్డారని కొనియాడారు. షరీఫ్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టకముందు తాను ఆ పదవిలో కొనసాగానని, ఆ సమయంలో అతడికి తాను బాస్‌గా వ్యవహరించానని ముషార్రఫ్ గుర్తుచేసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. షరీష్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి గత నెలలో రిటైరైన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఖమర్ జావెద్ బజ్వా పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా పాక్ లో ఏదైనా జరగాలంటే ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ సాయం ఆవశ్యకమని ఆర్మీ మాజీ బాస్ ముషార్రఫ్ పేర్కొన్నారు. పాక్ సుప్రీంకోర్టు తనపై విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించగా, షరీఫ్ జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా గత మార్చిలో తాను విదేశాలకు వెళ్లగలిగానని ముషార్రఫ్ వివరించారు. 2007లో ఎమర్జెన్సీ రూల్, జడ్జిలను అరెస్ట్ చేయడం వారి అధికారాలు తగ్గించడంపై ఆ తర్వాత కాలంలో చిక్కులు ఎదుర్కున్నారు. -
'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు'
-
పోతూ కూడా ఇండియాకు వార్నింగ్ !
పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ నోటిదురుసు.. దిగిపోతున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మంగళవారం భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కశ్మీర్ ఉద్రికత్తల విషయంలో తాము సంయమనంగా వ్యవహరించడాన్ని బలహీనతగా భావించవద్దని, అలా భావిస్తే ప్రమాదకరమైన పొరపాటేనని ఆయన అన్నారు. పదవీ నుంచి దిగిపోతున్న రహీల్ షరీఫ్ తన వారసుడైన కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను ఆహ్వానిస్తూ రావాల్పిండి ఆర్మీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఆక్రమిత కశ్మీర్లో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం పెరిగిపోయింది. భారత్ దురాక్రమణపూరిత చర్యలకు దిగుతుండటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి’ అని షరీఫ్ అన్నారు. ‘మా సంయమనాన్ని బలహీనతగా భావిస్తే.. అది భారత్‌కు ప్రమాదకరమేనని నేను ఆ దేశానికి స్పష్టం చేయదలిచాను’ అని పేర్కొన్నారు. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం అణ్వాయుధ దేశాలైన భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం, అనంతరం సరిహద్దుల్లో వరుస కాల్పులతో ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్‌మార్షల్ హోదా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరికొన్ని వారాల్లో రిటైర్ కానుండగా ఆయనకు సైన్యంలో అత్యున్నత స్థాయి అయిన ఫీల్డ్‌మార్షల్ హోదా కట్టబెట్టాలనే ప్రతిపాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు చేరింది. దేశం కోసం అత్యున్నత సేవలందించి, అనేక త్యాగాలు చేసిన రహీల్ షరీఫ్‌కు ఈ అత్యున్నత హోదా ఇవ్వాలని న్యాయవాది సర్దార్ అద్నన్ సలీమ్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమని, దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమగ్రంగా నిర్వర్తించేందుకు ఆర్మీచీఫ్‌కు పదోన్నతి కల్పించడమే సరైన పరిష్కారమని కోర్టుకు తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా షరీఫ్ ఈ ఏడాది నవంబర్ చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా నియమించారు. -
‘తూటాల వర్షంతో పరిష్కారం దొరకదు’
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్. కశ్మీర్ లోయలోని ప్రజలపై తూటాల వర్షం కురిపించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పారు. కశ్మీర్ పాక్‌కు జీవనాడి అని, అక్కడి ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి అన్ని స్థాయిల్లోనూ దౌత్య, నైతిక మద్దతు కొనసాగిస్తామన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించడమంటే.. బుల్లెట్ల వర్షం కురిపించడం కాదని, వారి ఆకాంక్షలను గౌరవించడం, వారి వాదనను వినడమే సరైన పరిష్కారమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు పరిచినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మంగళవారం రావల్పిండిలో జరిగిన డిఫెన్స్ డే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. -
సైనిక పాలన కావాలంటూ పోస్టర్లు
పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించాలని అక్కడి ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌ను కోరుతూ 13 నగరాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. లాహరో, కరాచీ, పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్, సర్గోడా, హైదరాబాద్ నగరాలతో పాటు.. మరికొన్ని నగరాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి. ‘మూవ్ ఆన్ పాకిస్థాన్’ అనే పార్టీ నేతృత్వంలో ఈ బ్యానర్లు పెట్టారు. ఇంతకుముందు ఇదే పార్టీ వాళ్లు షరీఫ్‌ను నవంబర్‌లో పదవీ విరమణ చేయొద్దంటూ ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపించారు. అధికారుల ప్రభుత్వం ఇక చాలని.. ఆర్మీచీఫ్ నేతృత్వంలో సైనిక పాలన విధించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు ‘మాప్’ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ తెలిపారు. జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వాన్ని చూసుకోవాలని అన్నారు. దీనిపై ఆర్మీ అధికారిక వార్తా సంస్థ ఏమీ స్పందించకపోయినా.. అక్కడి రాజకీయ విశ్లేషకుడు అమీర్ రాణా మాత్రం ఇదంతా చూస్తుంటే త్వరలోనే సైనిక కుట్ర ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రే ప్రధాన నగరాలన్నింటిలో.. అందులోనూ కంటోన్మెంటు ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. -
నవాజ్ సరికొత్త టీం
సంపాదకీయం: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందరి అంచనాలను తలకిందులు చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్‌ను నూతన ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ముగ్గురు సీనియర్లను కాదని రహీల్‌ను ఎంపిక చేయడానికి ముందు ఆయన ఎంతో అస్తిత్వవాద సందిగ్ధ వేదనను అనుభవించి ఉంటారు. ఇంతకుముందు రెండు దఫాలు ప్రధానిగా పనిచేసిన నవాజ్ గతంలో మూడుసార్లు ఆర్మీ చీఫ్‌లను నియమించారు. సీనియారిటీకి ప్రాధాన్యమనే సత్సాంప్రదాయాన్ని ఏ ఒక్కసారీ ఖాతరు చేయలేదు. ప్రతిసారీ ఆయన నిర్ణయం బెడిసికొట్టింది. అయినా ఈసారి కూడా అదే దారిన సాగడం విశేషం. 1993లో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సివస్తే, 1999లో పదవీచ్యుతులై, కటకటాలను లెక్కించాల్సి వచ్చింది. అది కూడా ఆయనే స్వయంగా ఏరి కోరి ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేసిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ చేతిలోనే. ముషార్రఫ్ పాక్‌ను కార్గిల్ యుద్ధంలోకి ఈడ్చడంతో నవాజ్ 1999లో ఆయనకు ఉద్వాసన పలికి, జనరల్ ఖ్వాజా జియావుద్దీన్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించే ప్రయత్నం చేశారు. ఫలితంగా ముషార్రఫ్ సైనిక కుట్రకు బలయ్యారు. ఆరు దశాబ్దాలు దాటిన పాక్ చరిత్రలో ఆర్మీ చీఫ్ నియామకం ఎప్పడూ కత్తి మీద సామే. పాక్ సైనిక నేతలకు దేశ రక్షణ బాధ్యతలపై కంటే రాజకీయాలపైనే మక్కువ. పౌర ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలు సైనిక నేతల అభీష్టాలకు తల ఒంచడం రివాజు. నేటి నవాజ్ ప్రభుత్వానికి ముందటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వంపై సైన్యం తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. శుక్రవారం పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ అష్ఫాక్ కయానీ, వచ్చే నెల 12న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహ్మద్ చౌధురి నాటి జర్దారీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఆ ప్రభుత్వం పూర్తి పదవీ కాలం అధికారంలో కొనసాగడమే పెద్ద విజయం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నవాజ్ మరో మారు ఆర్మీ చీఫ్ నియామకంలో సీనియారిటీని కాదనే సాహసం చేస్తారని ఎవరూ ఊహించ లేదు. పైగా కయానీ సూచించిన సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ రషద్ మహమూద్‌ను కాదని జనరల్ రహీల్‌ను ఎంపిక చేశారు. గతంలోలాగా నవాజ్ సైన్యంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ నియామకాన్ని చేసినట్టులేదు. వివాదరహితుడు, సమర్థుడు, రాజకీయాల్లో ఆసక్తి లేనివాడు కావడం జనరల్ రహీల్‌కు తోడ్పడిన మాట నిజమే. నూతన ఆర్మీ చీఫ్‌గా మీడియాలో ఊహాగానాలను రేకెత్తించిన ముగ్గురు అభ్యర్థులలో ఆయన లేనే లేరు. అదే ఆయనకు అర్హత అయింది. మిగతా వారి తరఫున పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి లాబీయింగ్ సాగుతుండగా ఆయన తరఫున మాట్లాడినవారే లేరు. సైన్యంలో తనకంటూ ఒక సొంత ముఠా లేకపోవడమే రహీల్‌ను ఆర్మీ చీఫ్‌ను చేసింది. అదే ఆయన బలహీనతగా రుజువయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. వచ్చే ఏడాది అఫ్ఘానిస్థాన్ నుంచి నాటో బలగాల ఉపసంహరణ జరగనున్నదనే వాస్తవం వల్లనే నవాజ్ సీనియారిటీకి తిలోదకాలిచ్చే సంప్రదాయాన్ని మరోమారు కొనసాగించారనేది స్పష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప వచ్చే ఏడాది అఫ్ఘాన్‌లో ఏర్పడ బోయే నూతన ప్రభుత్వంలో తాలిబన్లకు తావుండదు. నాటో బలగాల ఒత్తిడి తొలగడంతో అల్‌కాయిదా వంటి ఉద్రవాద జిహాదీ శక్తులు బలం పుంజుకునే అవకాశాలున్నాయి. దీంతో అంతర్గత ఉగ్రవాదం, మిలిటెన్సీ బలపడే ప్రమాదం ఉన్నదనే భయాలు పాక్‌లో సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. అంతర్గత ఉగ్రవాదం కూడా భారత్ నుంచి ఉన్న ముప్పుతో సమానమైనదిగా గుర్తించే సైనిక వ్యూహాన్ని రూపొందించినది రహీల్. పైగా ఆయన జిహాదీ గ్రూపులతో సత్సంబంధాలను నెరపుతున్నవారు కారు. ఆయనే ఆర్మీ చీఫ్ కావడం పాక్ అంతర్గత భద్రతకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతుందని నవాజ్ భావించడం సమంజసమే. అలా అని రహీల్... భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న శక్తులు కూడా పాక్‌కు అంతర్గత ముప్పేనని గుర్తించగలరని అప్పుడే చెప్పలేం. ‘ఆశాభావంతో ముందుకు పోయేవాడే నాయకుడు’ అన్నట్టు నవాజ్... రహీల్ నియామకంతో రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అంతా ఆయన అనుకున్నట్టే జరిగినా భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు నిలిచిపోతాయనిగానీ, సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందని గానీ చెప్పలేం. ఆ విషయంలో నవాజ్ నిస్సహాయత ఇప్పటికే స్పష్టమైంది. విదేశాంగ విధానం ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలకు లోబడే ఉండాలనే నియమాన్ని అనుసరించి రహీల్, నవాజ్‌లు అంతర్గత ఉగ్రవాదం సమస్యకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు. ఆర్మీ చీఫ్ నియామకంతో పాటే జరిగిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ నియామకంలో నవాజ్ గొప్ప రాజకీయ చతురతను ప్రదర్శించారు. త్రివిధ బలగాలకు వరుసగా ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించాల్సిన ఆ పదవిని చాలా కాలంగా సైన్యం తన హక్కుగా భావిస్తోంది. పాక్ అణ్వస్త్రాలపై నియంత్రణాధికారాలను కలిగిన వ్యూహాత్మక పథకాల విభాగం ఆ కమిటీ ఆధీనంలోనే ఉంటుంది. ఈసారి ఆ పదవికి నౌకా దళాధిపతి ఆసిఫ్ సంధేలాను నియమిస్తారని అంతా బావించారు. కానీ ఆర్మీ చీఫ్‌గా కయానీ ప్రతిపాదించిన జనరల్ రషద్ను నియమించి అటు ఆయన మాటా, ఇటు సైన్యం మాటా నెగ్గాలా చేశారు. ఇదే సందర్భంగా నవాజ్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ఆయన సీనియారిటీని కాదనకుండానే రహీల్ లాగే వివాదరహితునిగా, రాజకీయాల్లో ఆసక్తిలేని నిష్పక్షపాత న్యాయమూర్తిగా పేరున్న జస్టిస్ తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీని ఎంపిక చేశారు. పాక్ ప్రజాస్వామ్యానికి శుభ సూచనలుగా కనిపిస్తున్న ఈ నియామకాలు భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరుస్తాయని అప్పుడే చెప్పలేం. -
పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా రహీల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ బుధవారం నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయాని శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రహీల్‌ను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నియమించారు. పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన పదవి అయిన ఆర్మీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనికి ముగింపు పలుకుతూ రహీల్‌ను పాక్ ప్రధాని ఎంపిక చేశారు. మరోవైపు లెఫ్టినెంట్ జనరల్ రషద్ మహమూద్‌ను జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. మహమూద్ ప్రస్తుతం జనరల్ స్టాఫ్ చీఫ్‌గా ఉండగా.. రహీల్ షరీఫ్ ట్రెయినింగ్, ఎవల్యూషన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆర్మీ కొత్త చీఫ్‌గా నియమితులైన 57 ఏళ్ల రహీల్ మితవాదిగా పేరుపడ్డారు. ఆయన క్వెట్టాలో జన్మించారు. సైనిక కుటుంబం నుంచి వచ్చినవారు కావడం విశేషం. రహీల్ సోదరుడు 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో మరణించారు. రహీల్ నియామకం గురువారం నుంచే అమలులోకి వస్తుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవైపు దేశంలో హింసాత్మక సంఘటనలు పెరగడం, మరోవైపు సరిహద్దుల వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, వేరొకవైపు తాలిబాన్ తీవ్రవాదుల నుంచి సవాళ్లు ఎదురవుతుండడం నేపథ్యంలో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.