సైనిక పాలన కావాలంటూ పోస్టర్లు
పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించాలని అక్కడి ఆర్మీచీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ను కోరుతూ 13 నగరాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. లాహరో, కరాచీ, పెషావర్, క్వెట్టా, రావల్పిండి, ఫైసలాబాద్, సర్గోడా, హైదరాబాద్ నగరాలతో పాటు.. మరికొన్ని నగరాల్లో కూడా ఈ బ్యానర్లు కనిపించాయి. ‘మూవ్ ఆన్ పాకిస్థాన్’ అనే పార్టీ నేతృత్వంలో ఈ బ్యానర్లు పెట్టారు. ఇంతకుముందు ఇదే పార్టీ వాళ్లు షరీఫ్ను నవంబర్లో పదవీ విరమణ చేయొద్దంటూ ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపించారు.
అధికారుల ప్రభుత్వం ఇక చాలని.. ఆర్మీచీఫ్ నేతృత్వంలో సైనిక పాలన విధించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు ‘మాప్’ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజర్ అలీ హష్మీ తెలిపారు. జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా ప్రభుత్వాన్ని చూసుకోవాలని అన్నారు. దీనిపై ఆర్మీ అధికారిక వార్తా సంస్థ ఏమీ స్పందించకపోయినా.. అక్కడి రాజకీయ విశ్లేషకుడు అమీర్ రాణా మాత్రం ఇదంతా చూస్తుంటే త్వరలోనే సైనిక కుట్ర ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రే ప్రధాన నగరాలన్నింటిలో.. అందులోనూ కంటోన్మెంటు ప్రాంతాలలో కూడా ఈ పోస్టర్లు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.