పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ బుధవారం నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయాని శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ బుధవారం నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయాని శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రహీల్‌ను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నియమించారు. పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన పదవి అయిన ఆర్మీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనికి ముగింపు పలుకుతూ రహీల్‌ను పాక్ ప్రధాని ఎంపిక చేశారు. మరోవైపు లెఫ్టినెంట్ జనరల్ రషద్ మహమూద్‌ను జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా నియమించారు.
మహమూద్ ప్రస్తుతం జనరల్ స్టాఫ్ చీఫ్‌గా ఉండగా.. రహీల్ షరీఫ్ ట్రెయినింగ్, ఎవల్యూషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆర్మీ కొత్త చీఫ్‌గా నియమితులైన 57 ఏళ్ల రహీల్ మితవాదిగా పేరుపడ్డారు. ఆయన క్వెట్టాలో జన్మించారు. సైనిక కుటుంబం నుంచి వచ్చినవారు కావడం విశేషం. రహీల్ సోదరుడు 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో మరణించారు. రహీల్ నియామకం గురువారం నుంచే అమలులోకి వస్తుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవైపు దేశంలో హింసాత్మక సంఘటనలు పెరగడం, మరోవైపు సరిహద్దుల వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, వేరొకవైపు తాలిబాన్ తీవ్రవాదుల నుంచి సవాళ్లు ఎదురవుతుండడం నేపథ్యంలో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.