షకీల్‌ కొడుకు రాహిల్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. తెరపైకి మరో కేసు | BRS Ex-MLA Son Rahil Accused In Jubilee Hills Road Accident | Sakshi
Sakshi News home page

షకీల్‌ కొడుకు రాహిల్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. తెరపైకి మరో కేసు

Published Thu, Mar 21 2024 8:58 AM | Last Updated on Thu, Mar 21 2024 11:01 AM

BRS Ex MLA Son Rahil Accused In Jubilee Hills Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం  జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్‌ కొడుకే రాహిల్‌ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వచ్చిన మహీంద్రా థార్‌ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతో షకీల్‌ వాహనంగా తేలింది.

అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్‌ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్‌ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్‌ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్‌ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రాహిల్‌ అని పోలీసులు గుర్తించారు. 

మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్‌ సీట్‌ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహిల్‌ డ్రైవింగ్‌ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. 

ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ప్రజాభవన్‌ సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న షకీల్‌, రాహిల్‌కు ఇప్పటికే లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ అయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement