హైదరాబాద్: అదుపుతప్పిన వేగంతో వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సిక్ విలేజ్ గాంధీనగర్‌కు చెందిన లింగాల తారక్‌రామ్ (30), కె.రాజు మాదాపూర్ నోవాటెల్‌లో బౌన్సర్‌లుగా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు బైక్‌పై జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోకి రాగానే శ్రీ జ్యువెలర్స్ మలుపు వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన బ్లాక్ కలర్ కారు ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు తారక్‌రామ్‌కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. గత కొంతకాలంగా బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. గచ్చిబౌలి, మాదాపూర్ వైపు, జూబ్లీహిల్స్, పంజగుట్ట, బేగంపేట రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను వడబోస్తున్నారు.
సీసీ కెమెరాలకు కూడా అందనంత స్పీడ్‌గా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వేగానికి కారు నంబర్ ఏ ఒక్క కెమెరాలో కూడా చిక్కడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారని స్పష్టం తెలియడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారు.. వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. అన్నది తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు డీసీపీ విజయ్‌కుమార్ బుధవారం రాత్రి ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్‌ను సందర్శించారు. మరోవైపు గాయపడిన రాజు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుడి బంధువుల ఆందోళన
కారును అతివేగంగా నడిపిన నిందితుడ్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడమే కాకుండా ఈ ఘటనకు కారకుడైన నిందితుణ్ణి తమ ముందు ప్రవేశపెట్టాలని, కారును కూడా చూపించాలని డిమాండ్ చేశారు. తారక్‌రామ్ తల్లి రాజమణి, భార్య సుధారాణి, సోదరుడు గణేష్, బావలు ప్రదీప్, సునీల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కన్నీరుమున్నీరవుతూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ అదే దారిలో వెళ్లడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కారును కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇది కొత్త వెర్నా కారు అని పోలీసులు గుర్తించారు. ద్వారంపూడి నాగ అనే పేరుతో ఈ కారు రిజిస్ట్రేషన్ అయిఉందని నిర్ధారించారు
Comments
Please login to add a commentAdd a comment