సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా గత నెల ఆఖరివారంలో చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ నిందితుడిగా మారారు. కుమారుడు రహీల్ అమీర్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు చేసిన కుట్రకు ఆయనే సూత్రధారని దర్యాప్తు అ«ధికారులు తేల్చారు. ఈ ‘ఎస్కేప్ ఎపిసోడ్’లో మాజీ ఎమ్మెల్యే సహా పదిమంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
రహీల్ అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులతో కలిసి గత నెల 24వ తేదీ తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారును రహిల్‌నే నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఈ కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లను మితిమీరిన వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు.
అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసులు రహీల్‌ను ఠాణాకు తీసుకువచ్చారు. ఈలోపు విషయం ఫోన్ ద్వారా దుబాయ్‌లో ఉన్న తండ్రి షకీల్‌కు రహీల్ చెప్పాడు. ఆయన రంగంలోకి దిగి తన కుమారుడి స్థానంలో తన ఇంట్లో డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్‌ను ఉంచాలని పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడం కోసం రహీల్ స్నేహితులైన అర్బాజ్, సాహిల్‌తో పాటు మరి కొందరిని రంగంలోకి దింపారు. అర్బాజ్, సోహైల్‌లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటికి వెళ్లి అక్కడున్న ఆరిఫ్‌ను తీసుకుని పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా వద్దకు వచ్చారు. పోలీసులూ సహకరించడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం రహీల్ స్థానంలో ఆరిఫ్‌ను ఉంచారు.
సీసీ ఫుటేజ్‌తో అసలు వాస్తవం వెలుగులోకి
ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం కావడంతో కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.విజయ్‌కుమార్ సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అసలు కథ వెలుగులోకి వచ్చి పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన దుర్గారావుపై సస్పెన్సన్ వేటు పడింది. ఆరిఫ్‌ను అప్పుడే అరెస్టు చేసి రహీల్‌పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. ఈ ఎస్కేప్ వ్యవహారం దర్యాప్తు నేపథ్యంలో షకీల్‌తో పాటు అర్బాజ్, సాహిల్, మరో ఏడుగురి పాత్ర తాజాగా వెలుగులోకి వచి్చంది. దీంతో అర్బాజ్, సోహైల్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో షకీల్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు.
నిందితులపై అదనపు సెక్షన్లతో కేసులు
ఇప్పటికే రహీల్‌పై లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ అయి ఉంది. తాజాగా షకీల్‌తో పాటు రహీల్ ఎస్కేప్‌కు సహకరించి, దుబాయ్ పారిపోయిన మరో ఇద్దరి పైనా బుధవారం జారీ చేశారు. తొలుత పంజగుట్ట పోలీసులు ఆరిఫ్‌పై మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాల నేపథ్యంలో నిందితులపై ఐపీసీ, ఎంవీ యాక్ట్‌ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment