సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ హైదర్షాకోట్ వద్ద రోడ్డు పక్కన ఉదయం పూట వాకింగ్ చేస్తున్న ఇద్దరి ప్రాణాలను కారు ప్రమాదం బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలు తీసిన బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ చేసి పారిపోయిన బద్రుద్దిన్, ఫ్రెండ్స్ గ్యాంగ్ కనీసం గాయపడ్డ వారి గురించి సమాచారం కూడా ఇవ్వలేదు.
షాకైన పోలీసులు..
బద్రుద్దిన్ వెంట గణేష్, మహమ్మద్ ఇబ్రహీం, ఫైజన్ అనే వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్ జరగ్గానే డామేజ్ అయిన కారులోంచి జంప్ అయ్యారు. అప్పటికప్పుడు మరో ఫ్రెండ్‌కు వీరు కాల్ చేశారు. కాసేపటి తర్వాత మరో మిత్రుడు AP 09 BJ 2588 నెంబర్ గల కారుతో స్పాట్‌కు వచ్చాడు. అక్కడ నుంచి నేరుగా మొయినాబాద్ ఫాంహౌజ్‌కు పారిపోయారు. యాక్సిడెంట్ చేశామన్న స్పృహ లేకుండా పార్టీకి ఏర్పాట్లు చేసుకున్న ఆ గ్యాంగ్‌ను చూసి.. ఫాంహౌజ్‌కు వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. అప్పటికే ఫుడ్, డ్రింక్స్, స్టఫ్ రెడీ చేసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని బద్రుద్దిన్‌కు కారు ఎలా ఇచ్చారన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే?
మైనార్టీ తీరి మేజర్ అయ్యాననే ఆనందంతో ఉన్న యువకుడు రాత్రంతా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మరికొందరితో కలిసి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కారులో దూసుకుపోతున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న కారు లంగర్‌హౌస్–కాళిమందిర్ మార్గంలోని హైదర్షాకోట్ వద్ద మలుపు తిప్పుతూ అదుపు తప్పింది. బ్రేక్ వేయగా రోడ్డుపై ఉన్న ఇసుక ఫలితంగా స్కిడ్ అయి వాకింగ్ చేస్తున్న నలుగురిపై నుంచి దూసుకుపోయింది. కారు ఎడమ వైపు భాగం బలంగా తగలడంతో తల్లీకూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వాకర్స్ తీవ్రంగా గాయపడ్డారు.
పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా
ఈ ఘటన నగరవాసుల భద్రతను ప్రశ్నిస్తోంది. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయనే ఆవేదన ఉదయిస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని.. నగరంలో ఇలాంటి ప్రమాదాలు షరామామూలుగా మారాయని పలువురు ఆక్రందన వ్యక్తంచేస్తున్నారు. కారును వేగంగా నడిపి ఉదయం పూట వాకింగ్ చేస్తున్న అభమూ శుభమూ తెలియని ఇద్దరి ప్రాణాలను బలిగొన్న బద్రుద్దిన్ గ్యాంగ్‌ను కఠినంగా శిక్షించాలంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment