సంపాదకీయం: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందరి అంచనాలను తలకిందులు చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్‌ను నూతన ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ముగ్గురు సీనియర్లను కాదని రహీల్‌ను ఎంపిక చేయడానికి ముందు ఆయన ఎంతో అస్తిత్వవాద సందిగ్ధ వేదనను అనుభవించి ఉంటారు. ఇంతకుముందు రెండు దఫాలు ప్రధానిగా పనిచేసిన నవాజ్ గతంలో మూడుసార్లు ఆర్మీ చీఫ్‌లను నియమించారు. సీనియారిటీకి ప్రాధాన్యమనే సత్సాంప్రదాయాన్ని ఏ ఒక్కసారీ ఖాతరు చేయలేదు. ప్రతిసారీ ఆయన నిర్ణయం బెడిసికొట్టింది. అయినా ఈసారి కూడా అదే దారిన సాగడం విశేషం. 1993లో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సివస్తే, 1999లో పదవీచ్యుతులై, కటకటాలను లెక్కించాల్సి వచ్చింది.
అది కూడా ఆయనే స్వయంగా ఏరి కోరి ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేసిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ చేతిలోనే. ముషార్రఫ్ పాక్‌ను కార్గిల్ యుద్ధంలోకి ఈడ్చడంతో నవాజ్ 1999లో ఆయనకు ఉద్వాసన పలికి, జనరల్ ఖ్వాజా జియావుద్దీన్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించే ప్రయత్నం చేశారు. ఫలితంగా ముషార్రఫ్ సైనిక కుట్రకు బలయ్యారు. ఆరు దశాబ్దాలు దాటిన పాక్ చరిత్రలో ఆర్మీ చీఫ్ నియామకం ఎప్పడూ కత్తి మీద సామే. పాక్ సైనిక నేతలకు దేశ రక్షణ బాధ్యతలపై కంటే రాజకీయాలపైనే మక్కువ. పౌర ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలు సైనిక నేతల అభీష్టాలకు తల ఒంచడం రివాజు. నేటి నవాజ్ ప్రభుత్వానికి ముందటి ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రభుత్వంపై సైన్యం తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. శుక్రవారం పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ అష్ఫాక్ కయానీ, వచ్చే నెల 12న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహ్మద్ చౌధురి నాటి జర్దారీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఆ ప్రభుత్వం పూర్తి పదవీ కాలం అధికారంలో కొనసాగడమే పెద్ద విజయం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నవాజ్ మరో మారు ఆర్మీ చీఫ్ నియామకంలో సీనియారిటీని కాదనే సాహసం చేస్తారని ఎవరూ ఊహించ లేదు.
పైగా కయానీ సూచించిన సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ రషద్ మహమూద్‌ను కాదని జనరల్ రహీల్‌ను ఎంపిక చేశారు. గతంలోలాగా నవాజ్ సైన్యంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ నియామకాన్ని చేసినట్టులేదు. వివాదరహితుడు, సమర్థుడు, రాజకీయాల్లో ఆసక్తి లేనివాడు కావడం జనరల్ రహీల్‌కు తోడ్పడిన మాట నిజమే. నూతన ఆర్మీ చీఫ్‌గా మీడియాలో ఊహాగానాలను రేకెత్తించిన ముగ్గురు అభ్యర్థులలో ఆయన లేనే లేరు. అదే ఆయనకు అర్హత అయింది. మిగతా వారి తరఫున పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి లాబీయింగ్ సాగుతుండగా ఆయన తరఫున మాట్లాడినవారే లేరు. సైన్యంలో తనకంటూ ఒక సొంత ముఠా లేకపోవడమే రహీల్‌ను ఆర్మీ చీఫ్‌ను చేసింది. అదే ఆయన బలహీనతగా రుజువయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
వచ్చే ఏడాది అఫ్ఘానిస్థాన్ నుంచి నాటో బలగాల ఉపసంహరణ జరగనున్నదనే వాస్తవం వల్లనే నవాజ్ సీనియారిటీకి తిలోదకాలిచ్చే సంప్రదాయాన్ని మరోమారు కొనసాగించారనేది స్పష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప వచ్చే ఏడాది అఫ్ఘాన్‌లో ఏర్పడ బోయే నూతన ప్రభుత్వంలో తాలిబన్లకు తావుండదు. నాటో బలగాల ఒత్తిడి తొలగడంతో అల్‌కాయిదా వంటి ఉద్రవాద జిహాదీ శక్తులు బలం పుంజుకునే అవకాశాలున్నాయి. దీంతో అంతర్గత ఉగ్రవాదం, మిలిటెన్సీ బలపడే ప్రమాదం ఉన్నదనే భయాలు పాక్‌లో సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. అంతర్గత ఉగ్రవాదం కూడా భారత్ నుంచి ఉన్న ముప్పుతో సమానమైనదిగా గుర్తించే సైనిక వ్యూహాన్ని రూపొందించినది రహీల్.
పైగా ఆయన జిహాదీ గ్రూపులతో సత్సంబంధాలను నెరపుతున్నవారు కారు. ఆయనే ఆర్మీ చీఫ్ కావడం పాక్ అంతర్గత భద్రతకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతుందని నవాజ్ భావించడం సమంజసమే. అలా అని రహీల్... భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న శక్తులు కూడా పాక్‌కు అంతర్గత ముప్పేనని గుర్తించగలరని అప్పుడే చెప్పలేం. ‘ఆశాభావంతో ముందుకు పోయేవాడే నాయకుడు’ అన్నట్టు నవాజ్... రహీల్ నియామకంతో రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అంతా ఆయన అనుకున్నట్టే జరిగినా భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు నిలిచిపోతాయనిగానీ, సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందని గానీ చెప్పలేం. ఆ విషయంలో నవాజ్ నిస్సహాయత ఇప్పటికే స్పష్టమైంది. విదేశాంగ విధానం ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలకు లోబడే ఉండాలనే నియమాన్ని అనుసరించి రహీల్, నవాజ్‌లు అంతర్గత ఉగ్రవాదం సమస్యకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు.
ఆర్మీ చీఫ్ నియామకంతో పాటే జరిగిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ నియామకంలో నవాజ్ గొప్ప రాజకీయ చతురతను ప్రదర్శించారు. త్రివిధ బలగాలకు వరుసగా ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించాల్సిన ఆ పదవిని చాలా కాలంగా సైన్యం తన హక్కుగా భావిస్తోంది. పాక్ అణ్వస్త్రాలపై నియంత్రణాధికారాలను కలిగిన వ్యూహాత్మక పథకాల విభాగం ఆ కమిటీ ఆధీనంలోనే ఉంటుంది. ఈసారి ఆ పదవికి నౌకా దళాధిపతి ఆసిఫ్ సంధేలాను నియమిస్తారని అంతా బావించారు. కానీ ఆర్మీ చీఫ్‌గా కయానీ ప్రతిపాదించిన జనరల్ రషద్‌ను నియమించి అటు ఆయన మాటా, ఇటు సైన్యం మాటా నెగ్గాలా చేశారు. ఇదే సందర్భంగా నవాజ్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ఆయన సీనియారిటీని కాదనకుండానే రహీల్ లాగే వివాదరహితునిగా, రాజకీయాల్లో ఆసక్తిలేని నిష్పక్షపాత న్యాయమూర్తిగా పేరున్న జస్టిస్ తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీని ఎంపిక చేశారు. పాక్ ప్రజాస్వామ్యానికి శుభ సూచనలుగా కనిపిస్తున్న ఈ నియామకాలు భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరుస్తాయని అప్పుడే చెప్పలేం.
నవాజ్ సరికొత్త టీం
Published Fri, Nov 29 2013 4:03 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement