పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఫీల్డ్‌మార్షల్ హోదా కట్టబెట్టాలనే ప్రతిపాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు చేరింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరికొన్ని వారాల్లో రిటైర్ కానుండగా ఆయనకు సైన్యంలో అత్యున్నత స్థాయి అయిన ఫీల్డ్‌మార్షల్ హోదా కట్టబెట్టాలనే ప్రతిపాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు చేరింది. దేశం కోసం అత్యున్నత సేవలందించి, అనేక త్యాగాలు చేసిన రహీల్ షరీఫ్‌కు ఈ అత్యున్నత హోదా ఇవ్వాలని న్యాయవాది సర్దార్ అద్నన్ సలీమ్ కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమని, దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమగ్రంగా నిర్వర్తించేందుకు ఆర్మీచీఫ్‌కు పదోన్నతి కల్పించడమే సరైన పరిష్కారమని కోర్టుకు తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా షరీఫ్ ఈ ఏడాది నవంబర్ చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా నియమించారు.