ఇస్లామాబాద్: అవినీతి ఆరోపణల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట దక్కింది. శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అల్‌ఖాదీర్ ట్రస్ట్ కేసులో ఇదే కోర్టు బయట నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని పారామిలిటరీ బలగాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అల్‌ఖాదీర్ ట్రస్ట్ భూకబ్జా కేసులో విచారణకు ఇమ్రాన్ ఖాన్ హాజరవుతూ వస్తుండగా, పారామిలిటరీ రేంజర్ల సాయంతో దర్యాప్తు సంస్థ ఎన్‌ఏబీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆపై కోర్టు ఆదేశాలతో విచారణ కోసం కస్టడీలోకి కూడా తీసుకుంది. ఈ తరుణంలో గురువారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఇమ్రాన్‌ఖాన్‌ను గంటలోగా తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ సమయంలో ఎన్‌ఏబీ( నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయన అరెస్ట్ చట్టవిరుద్ధంగా ఉందని, చెల్లుబాటు కాదని పేర్కొంది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు ఇవాళ(శుక్రవారం) ఇస్లామాబాద్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది కూడా.
దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరుకాగా.. అల్‌ఖదీర్ ట్రస్ట్ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎన్‌ఏబీ కస్టడీ నుంచి రిలీజ్ అయ్యారు. అయితే..
లాహోర్ పోలీసుల బృందం ఒకటి ఇస్లామాబాద్‌కు బయల్దేరడంతో ఇమ్రాన్ ఖాన్ మరోసారి అరెస్ట్ అవుతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఆయనపై దాఖలైన కేసులకు గానూ ఇవాళ(శుక్రవారం) మరోసారి ఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక డాన్ కథనం ప్రచురించింది.
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు నమోదు అయ్యాయి. అవినీతితో పాటు ఉగ్రవాదం, హింసను ప్రేరేపించడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లాంటి తీవ్ర నేరాలు సైతం ఉన్నాయి.
عمران خان اسلام آباد ہائیکورٹ میں۔۔#میں_بھی_عمران_خان_ہوں pic.twitter.com/5xxClCUOXu
— PTI (@PTIofficial) May 12, 2023
ఇదీ చదవండి: పాక్ చరిత్రలోనే అదొక చీకటి అధ్యాయం
Comments
Please login to add a commentAdd a comment