మరో ఎనిమిది రోజుల్లో దేశంలో ఎన్నికలు. ఆరు నెలలుగా జైలులో ఉన్న మాజీ ప్రధాని. అవినీతి ఆరోపణలతో కటకటాల వెనక ఉన్న ఆయనపై... రెండు రోజుల్లో మరో రెండు కేసుల్లో వేర్వేరుగా 10 ఏళ్ళు, 14 ఏళ్ళ శిక్షలు. కనీసం మరో పదేళ్ళ పాటు ప్రభుత్వహోదా ఏదీ నిర్వహించనివ్వని నిషేధం. పార్టీ ఎన్నికల చిహ్నానికి కూడా తిరస్కరణ. మాజీ ప్రధాని గారి పార్టీ వైపు మొగ్గకుండా యువతరానికి హితోపదేశాల ఊదరగొడుతున్న ఆర్మీ ఛీఫ్. ఇలాంటి నాటకీయ పరిణామాలు ఒక్క పాకిస్తాన్‌లోనే సాధ్యం.
గతంలోనూ ఆ దేశంలో మాజీ ప్రధానులు పలువురు ఇలానే న్యాయ విచారణలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. నమ్మలేని ఈ న్యాయవిచారణల ద్వారా నేతల్ని బరిలో లేకుండా చేసే సిగ్గుమాలిన రాజకీయ దుస్సంప్రదాయం పాకిస్తాన్‌లో దీర్ఘకాలంగా ఉన్నదే. దాదాపు 14 వేల కోట్ల డాలర్ల అప్పులో కూరుకుపోయి, ఏటా ఆహార ధరలు 38.5 శాతం మేర పెరుగుతూ, ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణంతో సామాన్యులు సమరం చేస్తున్న పొరుగుదేశానికి ఇది ఏ రకంగానూ మేలు కాదు.
దేశరహస్య పత్రాలను లీక్ చేశారనే కేసులో కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు పదేళ్ళ జైలుశిక్ష ప్రకటిస్తే, మర్నాడే బుధవారం ప్రభుత్వ కానుకల అక్రమ విక్రయం (తోషాఖానా) కేసులో ఆయనకూ, ఆయన భార్యకూ కూడా చెరొక 14 ఏళ్ళ కారాగారవాస శిక్ష వేసింది. 150 కోట్ల రూపాయల జుల్మానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఏమైనా, 2022 ఏప్రిల్‌లో ప్రత్యర్థుల చేతిలో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలపై మూడేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ఎన్నికలు అతి దగ్గరలో ఉండగా ఈ తీర్పులు, శిక్షల ప్రకటన యాదృచ్ఛికం అనుకోలేం. ఇప్పటికే పదేళ్ళ పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులకూ తమ నేతను అనర్హుణ్ణి చేసిన శక్తులు ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకూ బ్రేకులు వేయదలిచారని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తోంది. తాజాగా శిక్షలు పడ్డ రెండు కేసుల్లోనూ తమ వకీళ్ళు పాకిస్తాన్ హైకోర్ట్‌కు అప్పీల్ చేశాక కథ కొత్త మలుపులు తిరగవచ్చని ఆ పార్టీ ఆశ.
రావల్పిండిలోని అడియాలా జైలులో 9 బై 11 అడుగుల పరిమాణంలోని చిన్న జైలు గదిలో గడచిన ఆగస్టు నుంచి గడుపుతూ, హింసాకాండ నుంచి తీవ్రవాదం దాకా సుమారు 180కి పైగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు 71 ఏళ్ళ ఇమ్రాన్. కేసులు, కోర్టులు, శిక్షలతో సంబంధం లేకుండా ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ మెండుగా ఉంది. ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను సైతం ఈ అంతర్జాతీయ క్రికెటర్ పార్టీకి దూరం చేశారు. ఎదురుదెబ్బ తగిలినా, జనంలో ఆయన పట్ల సానుభూతి, సానుకూలత ఆ పార్టీ అభ్యర్థులకు కాస్తంత సాంత్వన.
వారు గెలిచినా ఇండిపెండెంట్ల కిందే లెక్క. అసలు చిక్కంతా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో కలసి సైనిక వ్యవస్థ ఆడుతున్న అధికార క్రీడతోనే! తెర వెనుక చక్రం తిప్పే పాక్ సైన్యం కొన్ని నెలలుగా వేలాది పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణల దెబ్బతో డజన్లకొద్దీ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ప్రధాన స్రవంతి మీడియాలో ఇమ్రాన్ పేరు నిషేధించారు. ఇమ్రాన్ ప్రత్యర్థులకు కలిసొచ్చేలా నియోజక వర్గాల సరిహద్దుల్ని తిరగరాశారు. చివరకు ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
మాజీ ప్రధాని 74 ఏళ్ళ నవాజ్ షరీఫ్‌కు మాత్రం తెర వెనుక అండ పుష్కలం. అచ్చం ఇమ్రాన్ లానే అవినీతి ఆరోపణలతో 2017లో ఆయన పదవీచ్యుతుడయ్యారు. పదేళ్ళ జైలుశిక్ష పడింది. కానీ, వైద్య చికిత్సకంటూ 2018లో బెయిల్ మీద లండన్ వెళ్ళిన ఆయన తప్పించుకొని ప్రవాసంలో కాందిశీకుడిగా గడిపారు. చివరకు గత అక్టోబర్ 21 పాక్‌కు తిరిగొచ్చారు. వస్తూ్తనే జైలుశిక్ష రద్దయింది. రాజకీయాల నుంచి జీవితకాల నిషేధమూ ఎత్తేశారు. నాలుగోసారి ప్రధాని పీఠానికై పోటీ చేస్తున్న ఆయనకు గతంలో మూడుసార్లు ఆయనను గద్దె దింపిన సైన్యమే మళ్ళీ సాయంగా నిలవడం పాక్ రాజకీయ వైచిత్రికి తార్కాణం.
ఇవన్నీ చూశాకే ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలుండవని విశ్లేషకులు తీర్మానించేశారు. పాక్ ఓటర్లలో 40 శాతం మంది నిరక్షరాస్యులే. అయి తేనేం, ప్రజానీకానికి సైతం ఎన్నికల ప్రక్రియపై భ్రమలు ఎంతగా తొలగిపోయాయంటే, బరిలో మిగిలిన పార్టీల ప్రచారానికి సైతం స్పందన అంతంత మాత్రమే. అయితే, ఇమ్రాన్‌కు కోర్టు శిక్షలతో పాక్‌లో రాజకీయంగా చీలిక పెరగవచ్చు. అస్థిరత హెచ్చి, ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదం రావచ్చు. రేపు ఫలితాలు వెలువడిన తర్వాతా దేశంలో సుస్థిరత నెలకొనే అవకాశాలు అత్యల్పం.
పాక్ అధికార వ్యవస్థపై సైనిక యంత్రాంగపు క్రీనీడ విస్తరించి, ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియను పూర్తిగా బలహీనపరిచింది. సైనికాధికారులు తమ పరిధిలోకి ఏ మాత్రం రాని రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ నుంచి మతం, విదేశాంగ విధానం దాకా విద్యార్థులతో ముచ్చటిస్తుండడమే అందుకు మచ్చుతునక. అన్ని రకాలుగా సందేహాస్పదమైన ఈ ఎన్నికల ద్వారా, సైనిక వ్యవస్థ అండతో వచ్చే బలహీన పౌరప్రభుత్వం రేపు పరిపాలన ఎంత అందంగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పాక్ ఆర్థిక, జాతీయ భద్రతా రంగాల్లో దాని పని తీరు ఏమంత గొప్పగా ఉంటుందో వివరించనక్కర లేదు.
దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించడమెలాగో తమకు తెలుసని గతంలో అప్పటి పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఒక సిద్ధాంతం చెబితే, ఇప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్ సిద్ధాంత ప్రవచనం చేస్తున్నారు. వెరసి, ఈ ఫిబ్రవరి 8 నాటి ఎన్నికలు చివరకు ఓ తంతుగానే మారడం ఖాయం. బాహాటంగా పగ్గాలను సైన్యం చేత పట్టకున్నా, పేరుకు ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనిచ్చే పరిస్థితి మాత్రం ఉండదనేది నిస్సందేహం.
పాక్ ప్రజాస్వామ్య ప్రహసనం
Published Thu, Feb 1 2024 12:01 AM | Last Updated on Thu, Feb 1 2024 7:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment