jail imprisonment
-
చెక్ బౌన్స్ కేసులో గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
పాక్ ప్రజాస్వామ్య ప్రహసనం
మరో ఎనిమిది రోజుల్లో దేశంలో ఎన్నికలు. ఆరు నెలలుగా జైలులో ఉన్న మాజీ ప్రధాని. అవినీతి ఆరోపణలతో కటకటాల వెనక ఉన్న ఆయనపై... రెండు రోజుల్లో మరో రెండు కేసుల్లో వేర్వేరుగా 10 ఏళ్ళు, 14 ఏళ్ళ శిక్షలు. కనీసం మరో పదేళ్ళ పాటు ప్రభుత్వహోదా ఏదీ నిర్వహించనివ్వని నిషేధం. పార్టీ ఎన్నికల చిహ్నానికి కూడా తిరస్కరణ. మాజీ ప్రధాని గారి పార్టీ వైపు మొగ్గకుండా యువతరానికి హితోపదేశాల ఊదరగొడుతున్న ఆర్మీ ఛీఫ్. ఇలాంటి నాటకీయ పరిణామాలు ఒక్క పాకిస్తాన్‌లోనే సాధ్యం. గతంలోనూ ఆ దేశంలో మాజీ ప్రధానులు పలువురు ఇలానే న్యాయ విచారణలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. నమ్మలేని ఈ న్యాయవిచారణల ద్వారా నేతల్ని బరిలో లేకుండా చేసే సిగ్గుమాలిన రాజకీయ దుస్సంప్రదాయం పాకిస్తాన్లో దీర్ఘకాలంగా ఉన్నదే. దాదాపు 14 వేల కోట్ల డాలర్ల అప్పులో కూరుకుపోయి, ఏటా ఆహార ధరలు 38.5 శాతం మేర పెరుగుతూ, ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణంతో సామాన్యులు సమరం చేస్తున్న పొరుగుదేశానికి ఇది ఏ రకంగానూ మేలు కాదు. దేశరహస్య పత్రాలను లీక్ చేశారనే కేసులో కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు పదేళ్ళ జైలుశిక్ష ప్రకటిస్తే, మర్నాడే బుధవారం ప్రభుత్వ కానుకల అక్రమ విక్రయం (తోషాఖానా) కేసులో ఆయనకూ, ఆయన భార్యకూ కూడా చెరొక 14 ఏళ్ళ కారాగారవాస శిక్ష వేసింది. 150 కోట్ల రూపాయల జుల్మానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఏమైనా, 2022 ఏప్రిల్‌లో ప్రత్యర్థుల చేతిలో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలపై మూడేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికలు అతి దగ్గరలో ఉండగా ఈ తీర్పులు, శిక్షల ప్రకటన యాదృచ్ఛికం అనుకోలేం. ఇప్పటికే పదేళ్ళ పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులకూ తమ నేతను అనర్హుణ్ణి చేసిన శక్తులు ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకూ బ్రేకులు వేయదలిచారని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తోంది. తాజాగా శిక్షలు పడ్డ రెండు కేసుల్లోనూ తమ వకీళ్ళు పాకిస్తాన్ హైకోర్ట్‌కు అప్పీల్ చేశాక కథ కొత్త మలుపులు తిరగవచ్చని ఆ పార్టీ ఆశ. రావల్పిండిలోని అడియాలా జైలులో 9 బై 11 అడుగుల పరిమాణంలోని చిన్న జైలు గదిలో గడచిన ఆగస్టు నుంచి గడుపుతూ, హింసాకాండ నుంచి తీవ్రవాదం దాకా సుమారు 180కి పైగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు 71 ఏళ్ళ ఇమ్రాన్. కేసులు, కోర్టులు, శిక్షలతో సంబంధం లేకుండా ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ మెండుగా ఉంది. ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను సైతం ఈ అంతర్జాతీయ క్రికెటర్ పార్టీకి దూరం చేశారు. ఎదురుదెబ్బ తగిలినా, జనంలో ఆయన పట్ల సానుభూతి, సానుకూలత ఆ పార్టీ అభ్యర్థులకు కాస్తంత సాంత్వన. వారు గెలిచినా ఇండిపెండెంట్ల కిందే లెక్క. అసలు చిక్కంతా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో కలసి సైనిక వ్యవస్థ ఆడుతున్న అధికార క్రీడతోనే! తెర వెనుక చక్రం తిప్పే పాక్ సైన్యం కొన్ని నెలలుగా వేలాది పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణల దెబ్బతో డజన్లకొద్దీ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ప్రధాన స్రవంతి మీడియాలో ఇమ్రాన్ పేరు నిషేధించారు. ఇమ్రాన్ ప్రత్యర్థులకు కలిసొచ్చేలా నియోజక వర్గాల సరిహద్దుల్ని తిరగరాశారు. చివరకు ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. మాజీ ప్రధాని 74 ఏళ్ళ నవాజ్ షరీఫ్‌కు మాత్రం తెర వెనుక అండ పుష్కలం. అచ్చం ఇమ్రాన్ లానే అవినీతి ఆరోపణలతో 2017లో ఆయన పదవీచ్యుతుడయ్యారు. పదేళ్ళ జైలుశిక్ష పడింది. కానీ, వైద్య చికిత్సకంటూ 2018లో బెయిల్ మీద లండన్ వెళ్ళిన ఆయన తప్పించుకొని ప్రవాసంలో కాందిశీకుడిగా గడిపారు. చివరకు గత అక్టోబర్ 21 పాక్‌కు తిరిగొచ్చారు. వస్తూ్తనే జైలుశిక్ష రద్దయింది. రాజకీయాల నుంచి జీవితకాల నిషేధమూ ఎత్తేశారు. నాలుగోసారి ప్రధాని పీఠానికై పోటీ చేస్తున్న ఆయనకు గతంలో మూడుసార్లు ఆయనను గద్దె దింపిన సైన్యమే మళ్ళీ సాయంగా నిలవడం పాక్ రాజకీయ వైచిత్రికి తార్కాణం. ఇవన్నీ చూశాకే ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలుండవని విశ్లేషకులు తీర్మానించేశారు. పాక్ ఓటర్లలో 40 శాతం మంది నిరక్షరాస్యులే. అయి తేనేం, ప్రజానీకానికి సైతం ఎన్నికల ప్రక్రియపై భ్రమలు ఎంతగా తొలగిపోయాయంటే, బరిలో మిగిలిన పార్టీల ప్రచారానికి సైతం స్పందన అంతంత మాత్రమే. అయితే, ఇమ్రాన్‌కు కోర్టు శిక్షలతో పాక్‌లో రాజకీయంగా చీలిక పెరగవచ్చు. అస్థిరత హెచ్చి, ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదం రావచ్చు. రేపు ఫలితాలు వెలువడిన తర్వాతా దేశంలో సుస్థిరత నెలకొనే అవకాశాలు అత్యల్పం. పాక్ అధికార వ్యవస్థపై సైనిక యంత్రాంగపు క్రీనీడ విస్తరించి, ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియను పూర్తిగా బలహీనపరిచింది. సైనికాధికారులు తమ పరిధిలోకి ఏ మాత్రం రాని రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ నుంచి మతం, విదేశాంగ విధానం దాకా విద్యార్థులతో ముచ్చటిస్తుండడమే అందుకు మచ్చుతునక. అన్ని రకాలుగా సందేహాస్పదమైన ఈ ఎన్నికల ద్వారా, సైనిక వ్యవస్థ అండతో వచ్చే బలహీన పౌరప్రభుత్వం రేపు పరిపాలన ఎంత అందంగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పాక్ ఆర్థిక, జాతీయ భద్రతా రంగాల్లో దాని పని తీరు ఏమంత గొప్పగా ఉంటుందో వివరించనక్కర లేదు. దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించడమెలాగో తమకు తెలుసని గతంలో అప్పటి పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఒక సిద్ధాంతం చెబితే, ఇప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్ సిద్ధాంత ప్రవచనం చేస్తున్నారు. వెరసి, ఈ ఫిబ్రవరి 8 నాటి ఎన్నికలు చివరకు ఓ తంతుగానే మారడం ఖాయం. బాహాటంగా పగ్గాలను సైన్యం చేత పట్టకున్నా, పేరుకు ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనిచ్చే పరిస్థితి మాత్రం ఉండదనేది నిస్సందేహం. -
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
సూకీకి మరో ఆరేళ్ల జైలు శిక్ష
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
బోరిస్ బెకర్‌కు జైలుశిక్ష
లండన్: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది. అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
లండన్ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే
లండన్: లండన్‌లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు. -
రైళ్లలో ఈవ్‌టీజింగ్ చేస్తే మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళలను వేధించే వారికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యోచిస్తోంది. ఈ దిశగా రైల్వే చట్టంలో మార్పులు చేసేలా ప్రతిపాదన తెస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే భారత శిక్షాస్మృతిలో పేర్కొన్న శిక్ష కన్నా.. ఈ శిక్ష భారీగా ఉండే అవకాశం ఉంది. ‘ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మేం వేగంగా స్పందించేందుకు వీలవుతుంది’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి 2014–16 మధ్య కాలంలో 1,607 కేసులు నమోదయ్యాయి. -
అబూసలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు ఢిల్లీలోని ఓ కోర్టు గురువారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 2002లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అశోక్ గుప్తాను రూ.5 కోట్ల ప్రొటెక్షన్ మనీ ఇవ్వాలని బెదిరించిన కేసులో సలేంను కోర్టు మే 26న కోర్టు దోషిగా తేల్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జిæ.. సలేంకు ఏడేళ్ల కఠిన కారాగాశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న చంచల్ మెహతా, మాజిద్ ఖాన్, పవన్, మొహమ్మద్ అష్రఫ్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సహా పలు నేరాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సలేం నవీముంబైలోని తలోజా జైలులో ఉన్నాడు. -
మాజీ బ్యాంక్ మేనేజర్ కు కారాగార శిక్ష
న్యూఢిల్లీ: రూ. కోటి మేర వంచనకు పాల్పడిన కే సుకు సంబంధించి ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజర్‌తోపాటు మరొకరికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంప్రకాశ్ పాండే తీర్పు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి బ్యాంకు సొమ్మును వక్ర మార్గం పట్టించిన బ్యాంక్ మేనేజర్గావిధులు నిర్వర్తించిన 61 ఏళ్ల కృష్ణమూర్తితోపాటు ఓ ప్రైవేటు సంస్థ యజమాని అయిన ఇందర్కపూర్ లను దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 20 వేల చొప్పున న్యాయమూర్తి జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో దోషులైన పాపిందర్సింగ్ హండా ఒక సంవత్సరం, సంగీత్‌కుమార్‌కు మూడు సంవత్సరాల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. మరో నిందితుడు రత్నాకర్ నామా, జితేంద్ర గుప్తాలను మాత్రం సంశ య లబ్ధి కింద విడిచిపెట్టారు.మరో నిందితుడు దిల్జీత్ కపూర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కాగా నకిలీ పత్రాలను సమర్పించిన దోషులు బ్యాంకునుంచి రూ. కోట మేర రుణం పొందారు. ఇందుకు బ్యాంక్ మేనేజర్ సహకరించాడు. అభియోగాలకు సంబంధించి తగిన ఆధారాలు ఉండడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.