పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలయ్యే పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తనని జైలు పాలు చేసినా, అనర్హత వేటు వేసినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని పలు సందర్భాల్లో ధీమాగా చెప్పారు. మరి ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా భవిష్యత్ ఉండబోతోందా ? ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడిన కేసు ఏమిటి ? ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి?
ఏమిటీ తోషఖానా కేసు..?
► తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న మూడేళ్లలో 58 కానుకలు వచ్చాయి. అలా వచ్చిన కానుకల్ని ప్రధాని తీసుకోవాలంటే దాని ధరలో సగం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.
కానీ ఇమ్రాన్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించి అసలు ధరలో 20 శాతం మాత్రమే చెల్లించి కానుకలు తన సొంతం చేసుకున్నారు. 2018, సెప్టెబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 15.4 కోట్ల విలువైన కానుకల్ని కేవలం 3 కోట్లకే ఆయన సొంతం చేసుకున్నట్టుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదైంది.
పీటీఐపై నీలినీడలు?
► పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ)ఇమ్రాన్‌ఖాన్ ప్రజలపై వేసిన ప్రభావం గత అయిదు దశాబ్దాల్లో మరే నాయకుడు వెయ్యలేకపోయాడు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ తిరుగులేనిది. గత మేలో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినప్పుడు పీటీఐ కార్యకర్తలు దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారిని నియంత్రించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారింది.
గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధా నులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్, షాహిద్‌ఖాన్ అబ్బాసి వంటి వారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ పట్టించుకోని ప్రజలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో మిలటరీకే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ అభిమానుల్లో అప్పట్లో కనిపించిన ఆగ్రహావేశాలు చూస్తే పార్టీ పునాదులు ఎవరూ కదపలేరన్న భావన కలుగుతుంది. ఇమ్రాన్‌ఖాన్ ఒక్కడే నిజాయితీపరుడని, ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఆయన మాత్రమే గాడిలో పెట్టగలరన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ పవర్ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి.
చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్
ఇమ్రాన్‌ఖాన్‌కు బాగా మొండివాడన్న పేరుంది. రాజకీయాల్లో ఆయనకి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇమ్రాన్ ప్రధాని కావడానికి కారకుడైన అప్పటి ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో ఆయ న ఎక్కువ కాలం సత్సంబంధాలు నడపలేకపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇమ్రాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ సంకీర్ణ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇమ్రాన్‌ను కేసుల ఉచ్చులో బిగించాయి.
గత రెండు నెలల్లో పారీ్టకి చెందిన సీనియర్ నాయకులు 80 మందికి పైగా పార్టీని వీడారు. వారిని బెదిరించి పార్టీని వీడేలా చేశా రని ఇమ్రాన్ ఆరోపించినప్పటికీ వరసపెట్టి కీలకమైన నాయకులు వెళ్లిపోవడం పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఇమ్రాన్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు మిలటరీ జైళ్లలో ఉన్నారు. పాకిస్తాన్‌లో ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడం ఆయన పారీ్టకి శరాఘాతంలా తగిలింది.
పార్లమెంటు రద్దయిన 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇమ్రాన్‌పై ఐదేళ్లు అనర్హత వేటు పడడంతో ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అయింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల మధ్య ఉంటే పార్టీ ఎంతవరకు మనుగడ సాగించగలదన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఆశలన్నీ ఇప్పుడు పై కోర్టులోనే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుని పీటీఐ లాహోర్ హైకోర్టులో సవాల్ చేసింది.
ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయ నపై తుపాకీ గురిపెట్టి అపహరించుకొని వెళ్లిపోయారని పీటీఐ తన పిటిషన్‌లో విమర్శించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్రాన్ కూడా శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నారు. అరెస్ట్‌కు ముందే చేసి ఉంచిన రికార్డు మెసేజ్‌లో ఆయన కార్యకర్తలకి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తోషఖానాతో సహా 150 కేసుల్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఆ ఉచ్చులోంచి ఎలా బయటకి రాగలరన్న సందేహాలైతే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment