సుప్రీంకోర్టుకు వస్తున్న ఇమ్రాన్ ఖాన్(వెనక సీట్లో)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అల్–ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెసుŠట్ చేసి జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబీ) కస్టడీలో ఉంచడాన్ని పాక్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఇమ్రాన్‌ను అరెస్ట్‌చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. ఆయనను వెంటనే విడుదల చేయండి. విడుదలయ్యాక ఇస్లామాబాద్‌లో సురక్షిత ప్రాంతంలో ఉంచి రక్షణ కల్పించండి’అని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్టయిన ఇమ్రాన్‌కు పెద్ద ఉపశమనం లభించింది.
గంటలో హాజరుపరచండి
అంతకుముందు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో లాక్కెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఇమ్రాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్‌ఏబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గంటలోగా ఇమ్రాన్‌ను మా ముందుకు తీసుకురండి’ అని మధ్యాహ్నం 3.30కి ఎన్‌ఏబీని ఆదేశించింది.
దీంతో వెంటనే ఖాన్‌ను కోర్టుకు తీసుకొచ్చారు.‘హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణంలో ఎలా అరెస్ట్ చేస్తారు? న్యాయం కోసం కోర్టుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కోర్టులో లొంగిపోవడానికే వస్తుంటే అరెస్ట్ చేయడంలో అర్థమేముంది? అరెస్ట్ చేసేందుకు ఏకంగా 90 మంది పోలీసులు కోర్టులో చొరబడితే హైకోర్టుకు ఏం విలువ ఇచ్చినట్టు? అని అధికారులపై ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బందియాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘తదుపరి న్యాయపర ఆదేశాల అభ్యర్థన కోసం శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లండి. ఆ కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం’ అని ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అరెస్ట్‌తో రణరంగంలా మారిన పాక్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ‘ఒక నేరగాడిని విడుదల చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. నేరగాడికి రక్షణ కవచంగా ఉంటూ దేశంలో చెలరేగుతున్న హింసకు మరింత ఆజ్యం పోస్తున్నారు’ అని పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment