ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది.
ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు.
ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్‌పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment