
ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడు
► భుట్టో హత్య కేసులో నిర్థారించిన పాకిస్తాన్ కోర్టు
► ఆస్తుల స్వాధీనానికి ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పుచెప్పింది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. భుట్టో హత్య జరిగిన పదేళ్ల తర్వాత వెలువరించిన తీర్పులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. భుట్టో 2007 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు.
ఈ హత్యోదంతం తర్వాత కేసు నమోదు కాగా.. విచారణ సందర్భంగా అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పదేళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల ఎనిమిది మంది జడ్జీలు ఈ కేసును విచారించారు. చివరికి రావల్పిండి కోర్టు కేసు విచారణను బుధవారం ముగించింది. ఈ కేసులో తీర్పు వెలువరించిన జడ్జి అస్గర్ ఖాన్.. ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని ప్రకటించారు. వైద్య చికిత్సల నిమిత్తం గత ఏడాది పాకిస్థాన్ విడిచి వెళ్లిన ముషారఫ్ అప్పటి నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నారు. రావల్పిండి మాజీ సీపీవో సాద్ అజీజ్, రావల్ టౌన్ ఎస్పీ ఖుర్రమ్ షెహజాద్‌ను దోషులుగా ప్రకటించింది. వారికి ఒక్కొక్కరికీ 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ 5 లక్షల జరిమానా విధించింది.