
కోల్‌కతా: తన ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో ఇప్పటికే పలు విషయాల్ని వెల్లడించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అది కూడా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..తనను ఫోన్‌లో మందలించిన సంగతిని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పర్యటనలో సెక్యూరిటీకి చెప్పకుండా తాను బయటకు వెళ్లిన విషయం ముషారఫ్‌కు తెలియడం, ఆపై అతనే స్వయంగా కాల్ చేసి ఇక ఎప్పుడూ అలా చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గంగూలీ షేర్ చేసుకున్నాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్బంగా ఇది చోటు చేసుకున్నట్లు గంగూలీ తెలిపాడు.ఆ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. అదే సమయంలో పాకిస్తాన్‌పై ఆ దేశంలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా గంగూలీ ఘనత సాధించాడు. ఆ పర్యటనకు సంబంధించి గంగూలీ ఆత్మకథలో పలు విషయాల్ని ప్రస్తావించారు.
‘ఆ పర్యటన ముగిసిన తర్వాత లాహోర్ వీధుల్లో కాసేపు అలా బయటకు వెళ్లాలనుకున్నాం. కబాబ్స్, తందూరీ వంటకాలకు పేరుగాంచిన గవాల్మండి అనే ఫుడ్‌స్ర్టీట్‌లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా సరదాగా బయటకు వెళ్లాలనుకున్నా. కానీ, మేం బస చేసింది అత్యంత పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉన్న లాహోర్ స్విష్ పెర్మ్ కాంటినెంటల్ హోటల్‌లో. మా భద్రతా అధికారికి చెబితే వద్దంటాడని తెలుసు. అందుకే, మా టీమ్ మేనేజర్ చెప్పి హోటల్ బయటి తలుపునుంచి బయటకొచ్చా. నన్నెవరూ గుర్తు పట్టకుండా ముఖాన్ని కవర్ చేశా. అంతలోనే ఒక వ్యక్తి నన్ను గుర్తు పట్టి మీరు సౌరవ్ గంగూలీ కదా? అని ఆడిగాడు. నేను నా గొంతును మార్చి కాదని చెప్పా. సరే అంటూనే అతను.. మీరు అచ్చం గం గూలీలానే ఉన్నారన్నా డు. ఎలాగోలా అనుకున్న చోటుకు చేరుకున్నాం. కానీ, తిరుగు ప్రయాణంలో వెనకాలే ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి కారు అద్దం దించాలని కోరాడు. అతను బాంబు విరుతాడేమోనని భయపడి అద్దం దించొద్దని నా సహచరుడు వారించాడు. అయితే, ఆ వ్యక్తి చేతు లు చాచి 'నేను మీకు పెద్ద అభిమానిని. పాకిస్థాన్‌కు మీ లాంటి నాయకుడు కావాలి’ అంటూ అరుస్తున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని.. మేం సురక్షితంగా హోటల్ చేరుకున్నాం. ఆ వార్త అప్పటికే ఆ దేశాధ్యక్షుడి ఉన్న ముషార్‌ఫ్‌కు తెలిసింది. దాంతో, ఆయన నాకు కాల్ చేశారు. ఈ సారి మీరు బయటకు వెళ్లాలనుకుంటే భద్రతా సిబ్బందికి చెప్పండి. మీకు రక్షణగా వస్తారు. కానీ, దయచేసి ఇలా సాహసాలు చేయకండని ముషారఫ్ హెచ్చరించారు' అని గంగూలీ ఆత్మకథలో చెప్పుకొచ్చాడు.