ముషారఫ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్లు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో విచారణకు గైర్హాజరైన పాకిస్థాన్ మాజీ నియంత పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక విచారణ కోర్టు శుక్రవారం నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ముషారఫ్ మార్చి 31వ తేదీలోగా కోర్టు ఎదుట హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను అమలు చేస్తామని ప్రత్యేక కోర్టు రిజిస్ట్రార్ అబ్దుల్ ఘని సుమ్రో తెలిపారు. అనంతరం విచారణను కోర్టు ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అభియోగాల నమోదుకు కోర్టు ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఫైజల్ అరబ్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముషారఫ్‌ను ఆదేశించింది.
అయితే భద్రతా కారణాల రీత్యా ముషారఫ్ కోర్టుకు రాలేరని డిఫెన్స్ న్యాయవాదులు నివేదించారు. ముషారఫ్ హాజరు కావాలంటే కోర్టు వద్ద భద్రతా తనిఖీలు చేపట్టేందుకు కనీసం 6 వారాలు అవసరమని పేర్కొన్నారు. పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ఆయన భద్రతా సిబ్బందే హతమార్చిన తరహాలో ముషారఫ్‌పై దాడి జరిగే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.