
వాంకోవర్ (కెనడా) : పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్ బలూచ్ ఉమెన్ ఫోరమ్(డబ్ల్యూబీడబ్య్లూఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ పాకిస్తాన్ న్యూస్ చానల్‌తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్య్లూఎఫ్ నాయకురాలు ప్రొఫెసర్ నీలా ఖాద్రి బలూచ్ డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో మారణహోమాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్ సయీద్‌కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు.
ముషారఫ్ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్‌మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.