global terrorist
-
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం..
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది అబ్ధుల్ రెహ్మన్ మక్కీని యూఎన్ఓ భద్రతా మండలి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐల్(దయిష్), ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద జనవరి 16న మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్, ముంబాయి దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయిద్ బావనే రెహ్మాన్ మక్కీ. కాగా గతేడాది జూన్‌లో యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా.. భారత్ ప్రతిపాదనకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్లో ఎల్ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో మక్కీ కీలక పాత్ర పోషించారు. అంతేగాక.. యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు కుట్ర పన్నుతున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలో తాజాగా అబ్దుల్ మక్కీని ఐరాస గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఇదిలా ఉండగా 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశాడన్న కేసులో జైలు శిక్ష విధించింది. అయితే గతంలో కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. యూఎన్ నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ- మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను డ్రాగన్ దేశం పదేపదే అడ్డుకుంది. -
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్‌లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్‌లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్‌లో సాహిద్ మిర్, జూన్‌లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్‌లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ అరెస్ట్
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను బుధవారం పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్ సయీద్ అరెస్ట్ జరిగింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలపాలను నిరోధించాలని గత కొంతకాలంగా పాక్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సయీద్‌ను లాహోర్ నుంచి గుజ్రన్‌వాలా వెళుతుండగా అరెస్ట్‌చేసిన పాక్ పోలీసులు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా సయీద్ అరెస్ట్ వార్తలను భారత్ ధ్రువీకరించలేదు. గతంలోనూ పాకిస్తాన్ ఇలాంటి వార్తలను ప్రచారం చేసిందని, దీన్ని తాము నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది. కాగా మరో కేసులో లాహోర్ కోర్టు సయీద్‌కు మరో ముగ్గురికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదిగా ప్రకటన
-
అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదే
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు చైనా తలొగ్గింది. జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సన్నిహితుడైన మసూద్ అజార్(50)ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. డ్రాగన్ దేశం అడ్డుపుల్ల... మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అగ్రరాజ్యాల ప్రయత్నాలను భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం, వీటో అధికారం కలిగిన చైనా గత పదేళ్లలో నాలుగు సార్లు అడ్డుకుంటూ వచ్చింది. పుల్వామా ఘటన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు తమకు కొంత సమయం కావాలంటూ మెలికపెట్టింది. అయితే, ఈ విషయంలో ఇటీవలి కాలంలో చైనా సానుకూలత వ్యక్తం చేస్తోంది. చైనా అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల సంబంధిత దేశాలు 1267 కమిటీకి పంపిన ప్రతిపాదనల్లో కొన్నిటికి మార్పులు– చేర్పులు చేశాయి. తాజాగా చేర్చిన అంశాలను, ఆయా దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పట్టువదలని భారత్.. పెంచిన ఒత్తిడి అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ 2009 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. 20016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి వ్యూహకర్త అజార్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు సాయంతో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. 2017లో ఈ మూడు దేశాలు మరోసారి ఈ ప్రయత్నం చేశాయి. చైనా వీటోతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు కలిసి భద్రతామండలిలో నేరుగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాయి. కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్నే కారణమని ఆరోపిస్తూ భారత్ భద్రతా మండలిలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డ్రాగన్ దేశం అడ్డుకుంది. భారత్ తన ప్రయత్నాలను మాత్రం కొనసాగించి ఇతర మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకుంది. చైనాపై అంతర్జాతీయంగా, మరి ముఖ్యంగా అమెరికా ఒత్తిడి పెరిగింది. అజార్‌ను దిగ్బంధనం చేయడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తామంటూ భద్రతా మండలి చైనాకు హెచ్చరికలు పంపింది. దీంతో తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. భారత్‌పై పలు దాడులు 1999లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు 1994 నుంచి భారత్ జైలులో ఉన్న అజార్‌ను విడిపించుకు పోయారు. ఆ తర్వాత జైషే మొహమ్మద్‌ను స్థాపించిన అజార్ 2000లో కశ్మీర్‌లోని బాదామిబాగ్ సైనిక స్థావరంపై దాడి చేయించాడు. ఈ ఘటనలో 17 మంది వరకు జవాన్లు నేలకొరిగారు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి పథకం వేశాడు. ఆ తర్వాత పఠాన్‌కోట్, ఉడి, పుల్వామా తదితర ఘటనలకే ఇతడే సూత్రధారి. ఇతడికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలుగా తెరవెనుక సాయం అందిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలు తలెత్తటానికి ఇతడి కార్యకలాపాలే ప్రధాన కారణం. ఐరాస తీర్మానం ఏం చెబుతోంది? అల్ కాయిదాతో సంబంధాలు సాగిస్తూ జైషే మొహమ్మద్ సంస్థ పేరుతో, ఆ సంస్థ తరఫున, ఆ సంస్థ మద్దతుతో ఆయుధాలు, సంబంధిత సామగ్రి సరఫరా, విక్రయం, రవాణా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహ రచనతోపాటు ఆర్థిక సాయం చేస్తున్నందున మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేరుస్తున్నట్లు ఐరాస ఆంక్షల కమిటీ ప్రకటించింది. ఫలితంగా అజార్‌కు చెందిన ఆస్తుల స్తంభన, అతడిపై ప్రయాణ నిషేధం, ఆయుధ కొనుగోలుపై ఆంక్షలకు వీలవుతుంది. దీని ప్రకారం అన్ని దేశాలు ఎలాంటి ఆలస్యంగా లేకుండా సత్వరం అజార్ ఆస్తులు, నిధులు, ఆర్థిక వనరులపై ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. భారత్ ఘన విజయం: మోదీ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్‌కు దక్కిన ఘన విజయమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇప్పటికే ఆలస్యమైనా ఆహ్వానించదగ్గ, గర్వించదగ్గ పరిణామం. సహకరించిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు’ అని ఆయన తెలిపారు. ‘ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే, ఐరాస తీర్మానంలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రస్తావన లేకపోడం నిరుత్సాహం కలిగిస్తోంది’ అని కాంగ్రెస్ పేర్కొంది. ఆంక్షలను అమలు చేస్తాం: పాక్ రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని అంగీకరిస్తున్నాం. అజార్‌పై ఆంక్షలను వెంటనే అమలు చేస్తాం. స్వాగతించిన అమెరికా, ఫ్రాన్సు.. అంతర్జాతీయ సమాజం ఆకాంక్షించిన విధంగా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తమ ప్రయత్నాలు ఫలించాయనేందుకు సంకేతమని ఫ్రాన్సు తెలిపింది. -
ఫలించిన దౌత్యం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్
న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది. మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. Big,small, all join together. Masood Azhar designated as a terrorist in @UN Sanctions list Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism — Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 -
గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మసూద్ : నేడు ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కనుంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం లాంఛనంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. భారత్ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనాతో నెరపిన లాబీయింగ్ ఫలించడం సానుకూల ఫలితానికి దారితీసింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతోనే జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైందని అధికారులు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో దాడి నేపధ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామాం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు. ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది. -
మమ్మల్ని రెచ్చగొట్టొద్దు
వాషింగ్టన్/బీజింగ్/న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత పాక్‌కు చెందిన మసూద్ అజార్‌ను వెనకేసుకు రావద్దని చైనాకు అగ్రరాజ్యాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయి. అతడిని కట్టడి చేసేందుకు ఇతర చర్యలు తీసుకునే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశాయి. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 27వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుధవారం చైనా సాంకేతిక కారణాలతో వీటో చేసిన విషయం తెలిసిందే. చైనా చర్యను అగ్రరాజ్యాలు ఖండించాయి. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇదేవిధంగా అడ్డుకోవడం కొనసాగిస్తే, మండలిలోని మిగతా సభ్య దేశాలు ఇతర చర్యలను తీసుకునే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాయి. పరిస్థితిని అక్కడిదాకా తీసుకురానివ్వద్దు. మసూద్‌కు సంబంధించి చైనా ఇలా అడ్డుపుల్ల వేయడం పదేళ్లలో ఇది నాలుగోసారి’ అని ఓ సీనియర్ దౌత్యాధికారి తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలి చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు ప్రముఖులు తమ గళం వినిపిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా వీరిలో ఉన్నారు. ‘ఉగ్రవాది మసూద్ అజార్ మద్దతుదారులను, చైనాను మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెంటనే వెలివేయాలి. చైనాకు వ్యాపారమే ముఖ్యం. అందుకే ఆ దేశాన్ని ఆర్థికంగా వెలివేయడం యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని రాందేవ్ పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసమే: చైనా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా పలుమార్లు అడ్డుకున్న చైనా గురువారం తన చర్యను సమర్థించుకుంది. ’ఆంక్షల కమిటీ ఈ విషయంలో మరింత లోతైన పరిశీలన చేయడానికి మా చర్య దోహదపడుతుంది. సంబంధిత వర్గా(భారత్–పాక్)లు చర్చలు సాగించి అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఇది సాయపడుతుంది’ అని గురువారం చైనా పేర్కొంది. ఢిల్లీలో మసూద్ బస అజార్ 1994 ప్రాంతంలో ఢిల్లీలోని పలు హోటళ్లలో బస చేయడంతోపాటు కశ్మీర్ సహా పలు రాష్ట్రాలు పర్యటించి, ఉగ్ర నేతలను కలిశాడు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన చాణక్యపురిలోని హోటల్ అశోక్‌లోనూ ఉన్నాడు. తన పూర్వీకులు గుజరాతీలని అధికారులకు చెప్పి పోర్చుగల్ నకిలీ పాస్పోర్టుతో బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశించాడు. కశ్మీర్లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో పోలీసులకు ఈ వివరాలు వెల్లడించాడు. ఇతడితోపాటు భారత్ జైళ్లలో ఉన్న మరికొందరు ఉగ్ర నేతలను తప్పించేందుకే ముష్కరులు ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. చివరికి భారత ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి, మసూద్ సహా పలువురు టెర్రరిస్టులను దేశం వెలుపలికి పంపించాల్సి వచ్చింది. -
బ్లాక్‌లిస్ట్‌లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్
ఐక్యరాజ్యసమితి : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్‌ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. గతంలో 2017లో మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుల ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది. -
జైషే చీఫ్‌పై మారని చైనా తీరు
-
జైషే చీఫ్‌పై మారని చైనా తీరు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనను చైనా ఖండించినప్పటికీ ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షౌంగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి సుస్ధిరతలను పరిరక్షించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే అంశంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ను ఐరాస భద్రతా మండలి కౌంటర్-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
‘అమెరికానే అంతర్జాతీయ ఉగ్రవాది’
లాహోర్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అమెరికాపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. అసలు అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాది అని.. దాని ద్వారానే ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని హఫీజ్ చెబుతున్నాడు. గృహ నిర్భంధం నుంచి విముక్తి పొందాక పాక్ అతనిపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శుక్రవారం సెర్మోన్లో నిర్వహించిన ఓ బహిరంగ సభకు హాజరై హఫీజ్ ప్రసంగించాడు. ఈ క్రమంలో అమెరికాతోపాటు పాక్ పాలకులపైనా విరుచుకుపడ్డాడు. అమెరికా ఉగ్రవాద రాజ్యం... ‘‘శాంతి స్థాపన పేరిట యుద్ధాలు, దాడులు చేస్తూ లక్షల మంది ప్రజల ప్రాణాలను తీస్తున్న అమెరికానే అసలైన ఉగ్రవాది. పాక్ గడ్డ నుంచే అఫ్ఘనిస్థాన్‌పై అమెరికా దళాలు డ్రోన్ల దాడులతో విరుచుకుపడ్డాయి. తీరా ఓటమి పాలు కావటంతో పాక్‌పై ఆ నెపంను నెట్టేసి ఆర్థిక సాయంపై ఆంక్షలు విధించారు. చివరకు అప్ఘన్ ఉగ్ర సంస్థలకు సంధి కోసం అమెరికా ఆహ్వానం పంపింది. అలాంటి వాళ్ల ముందు పాకిస్థాన్ మోకరిల్లుతోంది. వారిచ్చే ఆర్థిక సాయం కోసం ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) సమావేశంలో నేను నిర్వహించే సంస్థలను ఉగ్ర సంస్థలుగా తీర్మానించే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించదు. ఎఫ్ఐఎఫ్ లాంటి ట్రస్ట్‌ల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. జమాత్-ఉద్-దావా (జేయూడీ) ద్వారా కశ్మీర్ స్వేచ్చ కోసం నేను పోరాడుతున్నాను. అలాంటి నన్ను కట్టడి చేయాలని అమెరికా ఆదేశించటమేంటి? దానిని పాక్ అమలు చేయాలని చూడటమేంటి? నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు పాక్ పాలకులు అందుకు సహకరిస్తున్నారు. నా రాజకీయ విభాగం జమాత్-ఉద్-దావా ఆస్తులు జప్తు చేయాలని ఆదేశిస్తున్నారు. అసలు వారికా ఆ హక్కులు ఉన్నాయా?’’ అని హఫీజ్ ప్రశ్నించాడు. తమ సంస్థలు ఉగ్రసంస్థలు కాదన్న విషయం ప్రపంచానికి తెలియజేసేలా పోరాటం చేస్తానని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడైన హఫీజ్ చెప్పుకొచ్చాడు. అల్లాను వ్యతిరేకించే వారంతా శత్రువులే... అల్లాను, ఇస్లాంను వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్‌కు శత్రువులేనని హఫీజ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో చైనా, టర్కీలకు బానిసత్వం చేయటం ఆపి.. వాటికి దూరంగా ఉండాలని పాక్ ప్రభుత్వానికి అతను సూచిస్తున్నాడు. ఆపద సమయంలో అల్లా తప్ప వాళ్లేవ్వరూ పాక్‌ను ఆదుకోలేరని అంటున్నాడు. క్రైస్తవులు, అమెరికన్లు, హిందువులు ఇలా.. అందరినీ శత్రువులుగానే భావించాలని ప్రజలను హఫీజ్ కోరాడు. కొసమెరుపు.. ఓ పక్క హఫీజ్ సయీద్, అతని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అవి యథాతథంగా కొనసాగుతున్నా అడ్డుకోకపోవటం విశేషం. పైగా హఫీజ్ నిర్వహించే రాజకీయ ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇస్తూ.. భద్రత కల్పించటం గమనార్హం. -
ముషారఫ్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది
వాంకోవర్ (కెనడా) : పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్ బలూచ్ ఉమెన్ ఫోరమ్(డబ్ల్యూబీడబ్య్లూఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ పాకిస్తాన్ న్యూస్ చానల్‌తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్య్లూఎఫ్ నాయకురాలు ప్రొఫెసర్ నీలా ఖాద్రి బలూచ్ డిమాండ్ చేశారు. కశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్ సయీద్‌కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు. ముషారఫ్ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. -
‘మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదే’
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు కొంత కాలంగా వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో గట్టి ఝలక్ ఇచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా స్పష్టం చేసింది. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్‌కు వంతపాడుతున్న చైనాను కూడా ఈ వ్యాఖ్యలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. మసూద్ అజర్ నిస్సందేహంగా ఉగ్రవాదాని పాల్డుతున్న వ్యక్తే. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ఆమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి హార్థర్ న్యూర్ట్ స్పష్టం చేశారు. మసూద్ అజర్ విషయంలో చైనా కూడా తన వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు. మసూద్ అజర్‌ని ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే క్రమంలో.. చైనా దానిని వీటో చేయడాన్ని ఆమె ఖండించారు. మసూద్ అజర్‌ని కాపాడే విషయంలో చైనా ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని ఆమె చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం మసూద్ అజర్‌ని, అతని సంస్థ జైషే మహమ్మద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని ఆమె స్పష్టం చేశారు. -
‘కాబూల్ కసాయి’ హెక్మత్యార్కు ఊరట
ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని, మిలటరీ కమాండర్ గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ఐరాస భద్రతామండలి ఊరటనిచ్చింది. అతని పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడమే కాకుండా.. సీజ్ చేసిన అతని ఆస్తులకు విముక్తి కలిగింది, ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్‌కు వ్యతిరేకి అయిన హెక్మత్యార్కు ‘కాబూల్ కసాయి’ అనే పేరుంది. పాకిస్థాన్ గూడఛారి సంస్థ ఐఎస్ఐతో హెక్మత్యార్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1997 నుంచి అతను పాకిస్థాన్ లోనే నివసిస్తున్నాడు. 1992–96 మధ్య పౌర యుద్ధంలో వేలాది మందిని చంపించాడు. గుల్బుద్దీన్ పై ఆంక్షలు ఎత్తివేయడాన్ని రష్యా వ్యతిరేకించింది. రెండు దశాబద్దాల ప్రవాసం తర్వాత అతడు కాబూల్ కు తిరిగి రానున్నాడు. -
ప్రపంచ టెర్రరిస్ట్‌గా టీటీపీ చీఫ్
ఇస్లామాబాద్: పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్ ఈ ప్రకటన చేయటం విశేషం. టీటీపీ చీఫ్ ముల్లా ఫజలుల్లా శనివారం హతమైనట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. దీంతో పాటు టీటీపీ, జేయూడీతో సహా మొత్తం పది ఉగ్రవాద సంస్థలపై కూడా పాక్ నిషేధం విధించే యోచనలో ఉంది.