అజార్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే | Masood Azhar Designated Global Terrorist In UN | Sakshi
Sakshi News home page

అజార్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే

Published Thu, May 2 2019 4:03 AM | Last Updated on Thu, May 2 2019 10:52 AM

Masood Azhar Designated Global Terrorist In UN - Sakshi

ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు చైనా తలొగ్గింది. జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్, పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు సన్నిహితుడైన మసూద్‌ అజార్‌(50)ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఫలితంగా, అజార్‌ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది.

డ్రాగన్‌ దేశం అడ్డుపుల్ల...
మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అగ్రరాజ్యాల ప్రయత్నాలను భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం, వీటో అధికారం కలిగిన చైనా గత పదేళ్లలో నాలుగు సార్లు అడ్డుకుంటూ వచ్చింది. పుల్వామా ఘటన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు తమకు కొంత సమయం కావాలంటూ మెలికపెట్టింది. అయితే, ఈ విషయంలో ఇటీవలి కాలంలో చైనా సానుకూలత వ్యక్తం చేస్తోంది. చైనా అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవల సంబంధిత దేశాలు 1267 కమిటీకి పంపిన ప్రతిపాదనల్లో కొన్నిటికి మార్పులు– చేర్పులు చేశాయి. తాజాగా చేర్చిన అంశాలను, ఆయా దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

పట్టువదలని భారత్‌.. పెంచిన ఒత్తిడి
అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ 2009 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. 20016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి వ్యూహకర్త అజార్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు సాయంతో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. 2017లో ఈ మూడు దేశాలు మరోసారి ఈ ప్రయత్నం చేశాయి. చైనా వీటోతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు కలిసి భద్రతామండలిలో నేరుగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాయి. కశ్మీర్‌లోని పుల్వామాలో  ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్‌నే కారణమని ఆరోపిస్తూ భారత్‌  భద్రతా మండలిలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డ్రాగన్‌ దేశం అడ్డుకుంది. భారత్‌ తన ప్రయత్నాలను మాత్రం కొనసాగించి ఇతర మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకుంది. చైనాపై అంతర్జాతీయంగా, మరి ముఖ్యంగా అమెరికా ఒత్తిడి పెరిగింది. అజార్‌ను దిగ్బంధనం చేయడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తామంటూ భద్రతా మండలి చైనాకు హెచ్చరికలు పంపింది. దీంతో తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది.

భారత్‌పై పలు దాడులు
1999లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు 1994 నుంచి భారత్‌ జైలులో ఉన్న అజార్‌ను విడిపించుకు పోయారు. ఆ తర్వాత జైషే మొహమ్మద్‌ను స్థాపించిన అజార్‌ 2000లో కశ్మీర్‌లోని బాదామిబాగ్‌ సైనిక స్థావరంపై దాడి చేయించాడు. ఈ ఘటనలో 17 మంది వరకు జవాన్లు నేలకొరిగారు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి పథకం వేశాడు. ఆ తర్వాత పఠాన్‌కోట్, ఉడి, పుల్వామా తదితర ఘటనలకే ఇతడే సూత్రధారి. ఇతడికి పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అన్ని విధాలుగా తెరవెనుక సాయం అందిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలు తలెత్తటానికి ఇతడి కార్యకలాపాలే ప్రధాన కారణం.

ఐరాస తీర్మానం ఏం చెబుతోంది?
అల్‌ కాయిదాతో సంబంధాలు సాగిస్తూ జైషే మొహమ్మద్‌ సంస్థ పేరుతో, ఆ సంస్థ తరఫున, ఆ సంస్థ మద్దతుతో ఆయుధాలు, సంబంధిత సామగ్రి సరఫరా, విక్రయం, రవాణా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహ రచనతోపాటు ఆర్థిక సాయం చేస్తున్నందున మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేరుస్తున్నట్లు ఐరాస ఆంక్షల కమిటీ ప్రకటించింది. ఫలితంగా అజార్‌కు చెందిన ఆస్తుల స్తంభన, అతడిపై ప్రయాణ నిషేధం, ఆయుధ కొనుగోలుపై ఆంక్షలకు వీలవుతుంది. దీని ప్రకారం అన్ని దేశాలు ఎలాంటి ఆలస్యంగా లేకుండా సత్వరం అజార్‌ ఆస్తులు, నిధులు, ఆర్థిక వనరులపై ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది.

భారత్‌ ఘన విజయం: మోదీ
అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్‌కు దక్కిన ఘన విజయమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇప్పటికే ఆలస్యమైనా ఆహ్వానించదగ్గ, గర్వించదగ్గ పరిణామం. సహకరించిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు’ అని ఆయన తెలిపారు. ‘ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే, ఐరాస తీర్మానంలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రస్తావన లేకపోడం నిరుత్సాహం కలిగిస్తోంది’ అని కాంగ్రెస్‌ పేర్కొంది.

ఆంక్షలను అమలు చేస్తాం: పాక్‌
రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని అంగీకరిస్తున్నాం. అజార్‌పై ఆంక్షలను వెంటనే అమలు చేస్తాం.

స్వాగతించిన అమెరికా, ఫ్రాన్సు..
అంతర్జాతీయ సమాజం ఆకాంక్షించిన విధంగా పాక్‌ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తమ ప్రయత్నాలు ఫలించాయనేందుకు సంకేతమని ఫ్రాన్సు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement