Jaish-e-Mohammed chief Maulana Masood Azhar
-
అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదే
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు చైనా తలొగ్గింది. జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సన్నిహితుడైన మసూద్ అజార్(50)ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. డ్రాగన్ దేశం అడ్డుపుల్ల... మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అగ్రరాజ్యాల ప్రయత్నాలను భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం, వీటో అధికారం కలిగిన చైనా గత పదేళ్లలో నాలుగు సార్లు అడ్డుకుంటూ వచ్చింది. పుల్వామా ఘటన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు తమకు కొంత సమయం కావాలంటూ మెలికపెట్టింది. అయితే, ఈ విషయంలో ఇటీవలి కాలంలో చైనా సానుకూలత వ్యక్తం చేస్తోంది. చైనా అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల సంబంధిత దేశాలు 1267 కమిటీకి పంపిన ప్రతిపాదనల్లో కొన్నిటికి మార్పులు– చేర్పులు చేశాయి. తాజాగా చేర్చిన అంశాలను, ఆయా దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. పట్టువదలని భారత్.. పెంచిన ఒత్తిడి అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ 2009 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. 20016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి వ్యూహకర్త అజార్‌పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు సాయంతో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. 2017లో ఈ మూడు దేశాలు మరోసారి ఈ ప్రయత్నం చేశాయి. చైనా వీటోతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు కలిసి భద్రతామండలిలో నేరుగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాయి. కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్నే కారణమని ఆరోపిస్తూ భారత్ భద్రతా మండలిలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డ్రాగన్ దేశం అడ్డుకుంది. భారత్ తన ప్రయత్నాలను మాత్రం కొనసాగించి ఇతర మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకుంది. చైనాపై అంతర్జాతీయంగా, మరి ముఖ్యంగా అమెరికా ఒత్తిడి పెరిగింది. అజార్‌ను దిగ్బంధనం చేయడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తామంటూ భద్రతా మండలి చైనాకు హెచ్చరికలు పంపింది. దీంతో తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. భారత్‌పై పలు దాడులు 1999లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు 1994 నుంచి భారత్ జైలులో ఉన్న అజార్‌ను విడిపించుకు పోయారు. ఆ తర్వాత జైషే మొహమ్మద్‌ను స్థాపించిన అజార్ 2000లో కశ్మీర్‌లోని బాదామిబాగ్ సైనిక స్థావరంపై దాడి చేయించాడు. ఈ ఘటనలో 17 మంది వరకు జవాన్లు నేలకొరిగారు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి పథకం వేశాడు. ఆ తర్వాత పఠాన్‌కోట్, ఉడి, పుల్వామా తదితర ఘటనలకే ఇతడే సూత్రధారి. ఇతడికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలుగా తెరవెనుక సాయం అందిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలు తలెత్తటానికి ఇతడి కార్యకలాపాలే ప్రధాన కారణం. ఐరాస తీర్మానం ఏం చెబుతోంది? అల్ కాయిదాతో సంబంధాలు సాగిస్తూ జైషే మొహమ్మద్ సంస్థ పేరుతో, ఆ సంస్థ తరఫున, ఆ సంస్థ మద్దతుతో ఆయుధాలు, సంబంధిత సామగ్రి సరఫరా, విక్రయం, రవాణా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహ రచనతోపాటు ఆర్థిక సాయం చేస్తున్నందున మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేరుస్తున్నట్లు ఐరాస ఆంక్షల కమిటీ ప్రకటించింది. ఫలితంగా అజార్‌కు చెందిన ఆస్తుల స్తంభన, అతడిపై ప్రయాణ నిషేధం, ఆయుధ కొనుగోలుపై ఆంక్షలకు వీలవుతుంది. దీని ప్రకారం అన్ని దేశాలు ఎలాంటి ఆలస్యంగా లేకుండా సత్వరం అజార్ ఆస్తులు, నిధులు, ఆర్థిక వనరులపై ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. భారత్ ఘన విజయం: మోదీ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్‌కు దక్కిన ఘన విజయమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇప్పటికే ఆలస్యమైనా ఆహ్వానించదగ్గ, గర్వించదగ్గ పరిణామం. సహకరించిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు’ అని ఆయన తెలిపారు. ‘ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే, ఐరాస తీర్మానంలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రస్తావన లేకపోడం నిరుత్సాహం కలిగిస్తోంది’ అని కాంగ్రెస్ పేర్కొంది. ఆంక్షలను అమలు చేస్తాం: పాక్ రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని అంగీకరిస్తున్నాం. అజార్‌పై ఆంక్షలను వెంటనే అమలు చేస్తాం. స్వాగతించిన అమెరికా, ఫ్రాన్సు.. అంతర్జాతీయ సమాజం ఆకాంక్షించిన విధంగా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తమ ప్రయత్నాలు ఫలించాయనేందుకు సంకేతమని ఫ్రాన్సు తెలిపింది. -
మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలకు, పాక్ సైన్యానికి ఉన్న సంబం ధం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌కు ఏకంగా రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్(50) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్ర పిండాల వ్యాధితో అతడికి రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో ప్రతిరోజూ డయాలసిస్ జరుగుతోందని పాక్ అధికారులు వెల్లడించారు. మసూద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు తమకు టచ్‌లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శుక్రవారం స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ‘మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాన సైనిక కార్యాలయం రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో రోజూ ఆయనకు డయాలసిస్ జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. పుల్వామా ఘటనకు బాధ్యుడైన మసూద్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మంత్రి.. ఆ ఆరోపణను జైషే మొహమ్మద్ సంస్థ కొట్టిపారేసిందంటూ బదులిచ్చారు. అయితే, పుల్వా మా ఘటన వెనుక తామే ఉన్నామంటూ ఆ సంస్థ ప్రకటించింది కదా అని పేర్కొనగా ఆ సంస్థ పాత్ర ఉందనే విషయం గట్టిగా చెప్పలేమనీ, దానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు. అవిఏమిటనే ప్రశ్నకు మంత్రి ఖురేషి.. తమ ప్రభుత్వం జైషే నాయకులతో మాట్లాడగా వారు ఖండించారని వివరించారు. నిషేధిత సంస్థ నాయకులతో ఎవరు మాట్లాడారన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇక్కడి ప్రజలు, వారిని గురించి తెలిసిన వారు’ అంటూ చెçప్పుకొచ్చారు. ఇలా ఉండగా, కరుడు గట్టిన ఉగ్రవాది జైషే మొహమ్మద్ అధినేత ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని అనారోగ్య స్థితికి చేరుకున్నారని పాక్ అధికారులు వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శుక్రవారం మంత్రి ఖురేషి తెలిపిన విషయం తెలిసిందే. జీహాద్ ప్రచారంలో దిట్ట మజూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి యత్నించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంతోపాటు, ఉడిలోని సైనిక క్యాంపుపై దాడికి పాల్పడింది. కశ్మీర్లో బలగాలపై దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు బాలాకోట్, ఖైబర్ ఫక్తున్వాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపే ఆధారాలను భారత ప్రభుత్వం ఇటీవల పాక్‌కు అందజేసింది కూడా. ఈ సంస్థను అగ్ర దేశాలు నిషేధించాయి. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడైన మసూద్‌ను భారత్ కస్టడీ నుంచి విడిపించుకునేందుకు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1999లో కాందహార్‌కు దారి మళ్లించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అతడు జైషే మొహమ్మద్‌ను స్థాపించాడు. 1979–1989 సంవత్సరాల మధ్య అఫ్గానిస్తాన్‌లో తిష్టవేసిన సోవియెట్ రష్యా సేనలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో మసూద్ గాయపడ్డాడు. అనంతరం కరడుగట్టిన చాందసవాదిగా మారిన అతడు ఉగ్ర సంస్థ హర్కతుల్ అన్సార్ కీలక నేతగా మారాడు. మంచి వక్త కూడా అయిన మసూద్ జీహాద్(పవిత్ర యుద్ధం)ను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడి కూడా తన సభ్యులేనంటూ ఈ సంస్థ ప్రకటించుకుంది. దీంతో అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ నేతృత్వంలో నడుస్తున్న బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ సంస్థ స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేపట్టి, తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్‌తో యుద్ధం ఆగదు..: జైషే భారత్–పాక్ దేశాల మధ్య సంబంధాలకతీతంగా భారత్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం (జీహాద్) కొనసాగుతుందని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తీర్మానించిందని భారత నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2017 నవం బర్ 17న పాక్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రదారుడు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సారథ్యం లో నిర్వహిస్తోన్న ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి జైషే మహ్మద్ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఘజ్వా–ఎ–హింద్ (భారత్‌పై ఆఖరి పోరాటం) సాగించాలని ఆ సమావేశాల్లో తీర్మానించింది. జైషే మహ్మద్ సంస్థ నాయకులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మహ్మద్ మసూద్, అబ్దుల్ మాలిక్ తాహీర్‌లు ఈ ఉగ్రవాద సమావేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా నిఘా సంస్థలు వెల్లడించాయి. 2018లో ఆరు రోజుల పాటు జైషే మహ్మద్ ‘షోబే తారఫ్’(డిపార్టమెంట్ ఆఫ్ ఇంట్రడక్ష న్) 65 మంది ఉలేమా (మతగురువు)లతో సహా 700ల మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్టు నిఘావర్గాల నివేదికలు బయటపెట్టాయి. మత గురువుల హర్షం...: జైషే సంస్థ 2018, మార్చిలో షోబ–ఎ–తారిఫ్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సియాల్ కోట్ జిల్లాలో 4 రోజుల పాటు 1,500ల మందితో 17 సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వీటికి హాజరైన 50 మంది మతగురువులు సమావేశాల పట్ల హర్షంవ్యక్తం చేసినట్టు సమాచారం. -
షరీఫ్ యాక్షన్‌తో మోదీకి రిలీఫ్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను ఆ దేశ భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకోవడం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికిప్పుడు రాజకీయంగా కొంత ఉపశమనమే. లాహోర్ దౌత్యం విఫలమైందంటూ మోదీ సర్వత్రా రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో పాక్ నుంచి వెలువడిన అజార్ డిటెన్షన్ కథనం.. దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఇది మోదీకి రాజకీయంగా కొంత రక్షణ కల్పించిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానంటూ 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఘాటైన ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల అలజడితో పాకిస్థాన్‌ను కాస్తా దూరంగా పెట్టారు. 2015 వచ్చేసరికి పాక్ విషయంలో ప్రధాని మోదీ వైఖరిలో గణనీయ మార్పు కనిపించింది. అన్ని భయాలు, దౌత్యపరమైన అడ్డంకులు, చిక్కులు పక్కనబెట్టి మరీ లాహోర్‌కు వెళ్లి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో తేనీటి విందు స్వీకరించారు. వ్యక్తిగతంగా షరీఫ్ మానవరాలి పెళ్లికి హాజరయ్యారు. దాయాది దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ చేసిన ఈ అసాధారణ చొరవపై అప్పట్లోనే అనేక భయాలు వెల్లువెత్తాయి. పాక్‌కు స్నేహహస్తం చాచిన ప్రతి సందర్భంలోనూ భారత్‌లో ఉగ్రవాదులు దాడులకు తెగబడి.. ఆ సంబంధాలకు విఘాతం కలిగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. ప్రధాని మోదీ చొరవ తప్పుమోనన్న రాజకీయ అభిప్రాయానికి తావిచ్చింది. మోదీ లాహోర్ దౌత్యాన్ని తప్పుబడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు విమర్శల దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగాలంటే పాకిస్థాన్ కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులైన జేఈఎం నేతలు, కార్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే షరీఫ్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం, ఐఎస్ఐ ఉమ్మడిగా వ్యవహరిస్తూ జేఈఎంపై దాడులు చేసి.. దాని సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ అంచనాలకు అనుగుణంగా షరీఫ్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి మోదీ లాహోర్ దౌత్య ప్రభావం ఉపయోగపడుతున్నట్టు ఈ వార్తలు స్పష్టంగా చాటుతున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై భారత్ ఇచ్చిన ఆధారాల ప్రకారం పాక్ చర్యలు తీసుకునేలా తన 'స్నేహితుడు' షరీఫ్‌పై మోదీ ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాగా కోరింది. కానీ మోదీ సర్కార్ సూచనల మేరకు షరీఫ్ ప్రభుత్వం విస్పష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం పైకి కనిపించేవిధంగా చేపడుతున్న చర్యలు కూడా ప్రధాని మోదీకి రాజకీయంగా, దౌత్యపరంగా కలిసివచ్చేవే.