షరీఫ్ యాక్షన్‌తో మోదీకి రిలీఫ్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను ఆ దేశ భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకోవడం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికిప్పుడు రాజకీయంగా కొంత ఉపశమనమే. లాహోర్ దౌత్యం విఫలమైందంటూ మోదీ సర్వత్రా రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో పాక్ నుంచి వెలువడిన అజార్ డిటెన్షన్ కథనం.. దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఇది మోదీకి రాజకీయంగా కొంత రక్షణ కల్పించిందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానంటూ 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఘాటైన ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల అలజడితో పాకిస్థాన్‌ను కాస్తా దూరంగా పెట్టారు. 2015 వచ్చేసరికి పాక్ విషయంలో ప్రధాని మోదీ వైఖరిలో గణనీయ మార్పు కనిపించింది. అన్ని భయాలు, దౌత్యపరమైన అడ్డంకులు, చిక్కులు పక్కనబెట్టి మరీ లాహోర్‌కు వెళ్లి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో తేనీటి విందు స్వీకరించారు. వ్యక్తిగతంగా షరీఫ్ మానవరాలి పెళ్లికి హాజరయ్యారు. దాయాది దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ చేసిన ఈ అసాధారణ చొరవపై అప్పట్లోనే అనేక భయాలు వెల్లువెత్తాయి. పాక్‌కు స్నేహహస్తం చాచిన ప్రతి సందర్భంలోనూ భారత్‌లో ఉగ్రవాదులు దాడులకు తెగబడి.. ఆ సంబంధాలకు విఘాతం కలిగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. ప్రధాని మోదీ చొరవ తప్పుమోనన్న రాజకీయ అభిప్రాయానికి తావిచ్చింది. మోదీ లాహోర్ దౌత్యాన్ని తప్పుబడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు విమర్శల దాడి చేశాయి.
ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగాలంటే పాకిస్థాన్ కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులైన జేఈఎం నేతలు, కార్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే షరీఫ్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం, ఐఎస్ఐ ఉమ్మడిగా వ్యవహరిస్తూ జేఈఎంపై దాడులు చేసి.. దాని సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ అంచనాలకు అనుగుణంగా షరీఫ్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి మోదీ లాహోర్ దౌత్య ప్రభావం ఉపయోగపడుతున్నట్టు ఈ వార్తలు స్పష్టంగా చాటుతున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై భారత్ ఇచ్చిన ఆధారాల ప్రకారం పాక్ చర్యలు తీసుకునేలా తన 'స్నేహితుడు' షరీఫ్‌పై మోదీ ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాగా కోరింది. కానీ మోదీ సర్కార్ సూచనల మేరకు షరీఫ్ ప్రభుత్వం విస్పష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం పైకి కనిపించేవిధంగా చేపడుతున్న చర్యలు కూడా ప్రధాని మోదీకి రాజకీయంగా, దౌత్యపరంగా కలిసివచ్చేవే.