'అప్పుడు కార్గిల్.. ఇప్పుడు పఠాన్కోట్'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆకస్మికంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు సంధించింది. గతంలో ప్రధాని హోదాలో వాజ్పేయి పాక్ పర్యటనకు వెళ్లాక కార్గిల్ యుద్ధం జరిగిందని, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్కు వెళ్లొచ్చాక పఠాన్కోట్ ఉగ్రవాద దాడి జరిగిందని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు.
యూపీఏ హయాంలో మంత్రులు బిరియానీని పాక్కు పంపుతున్నారని గతంలో మోదీ విమర్శలు చేశారని, ఆయన లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో కలసి వచ్చారని, ఇప్పుడు ఏం జరిగిందని షిండే ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో మోదీ పరిష్కార చర్యలు తీసుకోవాలని షిండే సూచించారు. మోదీ అప్ఘానిస్తాన్ నుంచి నేరుగా లాహోర్కు వెళ్లి షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయన మనవరాలి వివాహ వేడుకలో పాల్గొని వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు.. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేశారు.