న్యూఢిల్లీ : పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ హఫీజ్ సయీద్ కోసం ఆ దేశం తాజాగా ఐరాసను ఆశ్రయించింది. ముంబయి పేలుళ్ల సూత్రదారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతనికున్న బ్యాంక్‌ఖాతాను నిలిపివేసింది.
అప్పటి నుంచి తన వ్యక్తిగత, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవడంతో హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హఫీజ్‌కు వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 1,50,000 (పాక్ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ఐరాసను కోరింది. కాగా పాక్ చేసిన ప్రతిపాదనపై గడువులోగా ఐరాస సభ్య దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదిస్తూ హఫీజ్ తన బ్యాంక్ ఖాతాను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో అరెస్టైన హఫీజ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment