![Hafiz Saeed Slams America as Biggest Global Terrorist - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/3/Hafiz-Saeed-Pak-America-Glo.jpg.webp?itok=-FbKcnjP)
హఫీజ్ సయ్యిద్ (తాజా చిత్రం)
లాహోర్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అమెరికాపై సంచలన ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. అసలు అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాది అని.. దాని ద్వారానే ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని హఫీజ్ చెబుతున్నాడు. గృహ నిర్భంధం నుంచి విముక్తి పొందాక పాక్ అతనిపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శుక్రవారం సెర్మోన్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభకు హాజరై హఫీజ్ ప్రసంగించాడు. ఈ క్రమంలో అమెరికాతోపాటు పాక్ పాలకులపైనా విరుచుకుపడ్డాడు.
అమెరికా ఉగ్రవాద రాజ్యం...
‘‘శాంతి స్థాపన పేరిట యుద్ధాలు, దాడులు చేస్తూ లక్షల మంది ప్రజల ప్రాణాలను తీస్తున్న అమెరికానే అసలైన ఉగ్రవాది. పాక్ గడ్డ నుంచే అఫ్ఘనిస్థాన్‌పై అమెరికా దళాలు డ్రోన్ల దాడులతో విరుచుకుపడ్డాయి. తీరా ఓటమి పాలు కావటంతో పాక్‌పై ఆ నెపంను నెట్టేసి ఆర్థిక సాయంపై ఆంక్షలు విధించారు. చివరకు అప్ఘన్ ఉగ్ర సంస్థలకు సంధి కోసం అమెరికా ఆహ్వానం పంపింది. అలాంటి వాళ్ల ముందు పాకిస్థాన్ మోకరిల్లుతోంది. వారిచ్చే ఆర్థిక సాయం కోసం ఎఫ్‌ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) సమావేశంలో నేను నిర్వహించే సంస్థలను ఉగ్ర సంస్థలుగా తీర్మానించే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించదు.
ఎఫ్‌ఐఎఫ్ లాంటి ట్రస్ట్‌ల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. జమాత్-ఉద్-దావా (జేయూడీ) ద్వారా కశ్మీర్ స్వేచ్చ కోసం నేను పోరాడుతున్నాను. అలాంటి నన్ను కట్టడి చేయాలని అమెరికా ఆదేశించటమేంటి? దానిని పాక్ అమలు చేయాలని చూడటమేంటి? నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు పాక్ పాలకులు అందుకు సహకరిస్తున్నారు. నా రాజకీయ విభాగం జమాత్-ఉద్-దావా ఆస్తులు జప్తు చేయాలని ఆదేశిస్తున్నారు. అసలు వారికా ఆ హక్కులు ఉన్నాయా?’’ అని హఫీజ్ ప్రశ్నించాడు. తమ సంస్థలు ఉగ్రసంస్థలు కాదన్న విషయం ప్రపంచానికి తెలియజేసేలా పోరాటం చేస్తానని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడైన హఫీజ్ చెప్పుకొచ్చాడు.
అల్లాను వ్యతిరేకించే వారంతా శత్రువులే...
అల్లాను, ఇస్లాంను వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్‌కు శత్రువులేనని హఫీజ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో చైనా, టర్కీలకు బానిసత్వం చేయటం ఆపి.. వాటికి దూరంగా ఉండాలని పాక్ ప్రభుత్వానికి అతను సూచిస్తున్నాడు. ఆపద సమయంలో అల్లా తప్ప వాళ్లేవ్వరూ పాక్‌ను ఆదుకోలేరని అంటున్నాడు. క్రైస్తవులు, అమెరికన్లు, హిందువులు ఇలా.. అందరినీ శత్రువులుగానే భావించాలని ప్రజలను హఫీజ్ కోరాడు.
కొసమెరుపు.. ఓ పక్క హఫీజ్ సయీద్, అతని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అవి యథాతథంగా కొనసాగుతున్నా అడ్డుకోకపోవటం విశేషం. పైగా హఫీజ్ నిర్వహించే రాజకీయ ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇస్తూ.. భద్రత కల్పించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment