సాక్షి, న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌కు భారీ విజయం దక్కనుంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని కోరుతూ భారత్ దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇప్పటికే భారత్ డిమాండ్‌కు బాసటగా నిలవగా మోకాలడ్డుతున్న చైనా తన వైఖరిని మార్చుకోవడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి బుధవారం లాంఛనంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
భారత్ నిరంతర దౌత్య ప్రయత్నాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనాతో నెరపిన లాబీయింగ్ ఫలించడం సానుకూల ఫలితానికి దారితీసింది. నిరంతర చర్చలు, దౌత్య యత్నాలతోనే జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైందని అధికారులు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో దాడి నేపధ్యంలో ఓ ఉగ్రవాదిని ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో ఈ పరిణామాం ప్రధాని నరేంద్ర మోదీకి కలిసివస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment