పట్నా : కేంద్ర మంత్రి, హజారిబాగ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్‌ను మసూద్ అజర్‌జీ అని సంభోదించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ‘దేశ భద్రతకు ఇది మైలురాయి వంటిది..మేం చేపట్టిన ప్రయత్నాలు నెరవేరి మసూద్ అజర్‌జీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింద’ని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు.
బిహార్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మసూద్ అజర్‌ను సాహెబ్‌గా పిలిచిన బిహార్ మాజీ సీఎం, మహాకూటమి నేత జితన్ రాం మాంఝీని బీజేపీ మందలించిన కొద్ది గంటల్లోనే సిన్హా నోరుజారడం గమనార్హం. మన్మోహన్ సింగ్ హయాం నుంచి మసూద్ అజర్ సాహెబ్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించే ప్రయత్నాలు సాగినప్పటికీ ఇప్పటికి ఆ నిర్ణయం వెలువడటం కాకతాళీయమేనని జితన్ రాం మాంఝీ వ్యాఖ్యానించారు. మాంఝీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అభ్యంతరం లేవనెత్తగా తాజాగా తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మసూద్‌జీ అంటూ సంభోదించడం ఆ పార్టీని ఇరకాటంలో పడవేసింది.
Comments
Please login to add a commentAdd a comment