అహ్మదాబాద్‌లో మసూద్ అజర్ ఫొటోను తగలబెడుతున్న బీజేపీ శ్రేణులు
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్‌లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు.
జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.
గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్
అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు.
పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి
పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది
అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ
ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment