Jaish e Mohammed chief Masood Azhar
-
ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు. -
‘అతను ఉగ్రవాది మసూద్ అజహర్ అల్లుడు’
లక్నో : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ప్రచారంలో భాగంగా పార్టీలన్ని ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షహరాన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఉగ్ర సంస్థ జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అల్లుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షహరాన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. షహరాన్‌పూర్‌లో ఉగ్రవాది మసూద్ అజహర్ తరఫున మాట్లాడే వ్యక్తి(కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్) గెలవాలో.. లేక మోదీ సైనికుడు విజయం సాధించాలో మీరే నిర్ణయించుకొండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే.. మోదీ ప్రభుత్వం వారి చేత బెల్లెట్లు, బాంబులను తినిపించిందని యోగి పేర్కొన్నారు. అంతేకాక అత్యంత కిరాతక ఉగ్రవాదిగా పేరు గాంచిన ఒసామా బిన్ లాడెన్‌కు ఏ గతి పట్టిందో.. మసూద్ అజహర్‌కు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక యూపీలో ఎస్పీ - బీఎస్పీ కూటమిని ఉద్దేశిస్తూ 37 - 38 స్థానాల్లో పోటీ చేసేవారు ప్రధాని కావాలని ఆశిస్తున్నారంటూ చురకలంటించారు. ఇదే వేదిక మీదుగా రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాలపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ‘రాహుల్ గాంధీకి భారతీయ సంస్కృతి గురించి ఏ మాత్రం తెలీదు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించినప్పుడు నమాజ్‌కు ఎలా కూర్చుంటారో రాహుల్ ఆలయంలో అలా కూర్చున్నార’ని ఆరోపించారు. ‘ఇక కాంగ్రెస్‌లో ఓ మహాగురు ఉన్నారు. మన సాయుధ బలగాల త్యాగాన్ని ప్రశ్నించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారం’టూ శామ్ పిట్రోడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మమ్మల్ని రెచ్చగొట్టొద్దు
వాషింగ్టన్/బీజింగ్/న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత పాక్‌కు చెందిన మసూద్ అజార్‌ను వెనకేసుకు రావద్దని చైనాకు అగ్రరాజ్యాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయి. అతడిని కట్టడి చేసేందుకు ఇతర చర్యలు తీసుకునే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశాయి. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 27వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుధవారం చైనా సాంకేతిక కారణాలతో వీటో చేసిన విషయం తెలిసిందే. చైనా చర్యను అగ్రరాజ్యాలు ఖండించాయి. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇదేవిధంగా అడ్డుకోవడం కొనసాగిస్తే, మండలిలోని మిగతా సభ్య దేశాలు ఇతర చర్యలను తీసుకునే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాయి. పరిస్థితిని అక్కడిదాకా తీసుకురానివ్వద్దు. మసూద్‌కు సంబంధించి చైనా ఇలా అడ్డుపుల్ల వేయడం పదేళ్లలో ఇది నాలుగోసారి’ అని ఓ సీనియర్ దౌత్యాధికారి తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలి చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు ప్రముఖులు తమ గళం వినిపిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా వీరిలో ఉన్నారు. ‘ఉగ్రవాది మసూద్ అజార్ మద్దతుదారులను, చైనాను మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెంటనే వెలివేయాలి. చైనాకు వ్యాపారమే ముఖ్యం. అందుకే ఆ దేశాన్ని ఆర్థికంగా వెలివేయడం యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని రాందేవ్ పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసమే: చైనా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా పలుమార్లు అడ్డుకున్న చైనా గురువారం తన చర్యను సమర్థించుకుంది. ’ఆంక్షల కమిటీ ఈ విషయంలో మరింత లోతైన పరిశీలన చేయడానికి మా చర్య దోహదపడుతుంది. సంబంధిత వర్గా(భారత్–పాక్)లు చర్చలు సాగించి అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఇది సాయపడుతుంది’ అని గురువారం చైనా పేర్కొంది. ఢిల్లీలో మసూద్ బస అజార్ 1994 ప్రాంతంలో ఢిల్లీలోని పలు హోటళ్లలో బస చేయడంతోపాటు కశ్మీర్ సహా పలు రాష్ట్రాలు పర్యటించి, ఉగ్ర నేతలను కలిశాడు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన చాణక్యపురిలోని హోటల్ అశోక్‌లోనూ ఉన్నాడు. తన పూర్వీకులు గుజరాతీలని అధికారులకు చెప్పి పోర్చుగల్ నకిలీ పాస్పోర్టుతో బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశించాడు. కశ్మీర్లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో పోలీసులకు ఈ వివరాలు వెల్లడించాడు. ఇతడితోపాటు భారత్ జైళ్లలో ఉన్న మరికొందరు ఉగ్ర నేతలను తప్పించేందుకే ముష్కరులు ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. చివరికి భారత ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి, మసూద్ సహా పలువురు టెర్రరిస్టులను దేశం వెలుపలికి పంపించాల్సి వచ్చింది. -
నిర్బంధంలో అజహర్ కొడుకు, సోదరుడు
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్ మసూద్ అజహర్ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్ కొడుకు హమద్ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్ హోం శాఖ వెల్లడించింది. అరెస్ట్ కాదు..: భారత్ ఈఅరెస్టులపై భారత్ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో జమాతే–ఉద్–దవా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్ ఫౌండేషన్‌ను పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్‌లిస్ట్‌లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
బీజేపీ అగ్రనాయకుల హత్యకు కుట్ర ?
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన సీనియర్ నాయకులను, ప్రముఖ ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టులు వస్తున్నాయి. జైషే ఈ మహ్మద్(జేఈఎమ్) చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం జేఈఎమ్, లష్కర్ ఈ తోయిబా(ఎల్ఈటీ)లు కలసి బంగ్లాదేశ్ నుంచి కుట్రను అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌లోకి ప్రవేశించినట్లు కూడా సమాచారం. తక్కువ భద్రతతో తిరుగుతున్న ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని తొలి లక్ష్యంగా ఉగ్ర సంస్థలు నిర్దేశించుకున్నట్లు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన భారత ఇంటిలిజెన్స్ బృందం బంగ్లాదేశ్‌కు చెందిన అధికారుల సాయంతో ఢాకాలోని అనుమానిత ప్రదేశంపై రైడింగ్ జరిపించింది. అయితే, రైడింగ్‌లో ఎలాంటి సమాచారం దొరకలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని ఓ ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. మసూద్ అజర్ మేనల్లుడు(తహ్లా రషీద్)ని కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ కుట్ర జరుగుతోందనే సమాచారం కూడా ఉందని చెప్పారు. -
ఉగ్రదాడి మసూద్ అజర్, ఆయన సోదరుడి పనే
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పటాన్ కోట్ దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జీషీటు దాఖలు చేసింది. జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఈ దాడికి కీలక సూత్రదారుడిగా అందులో ఎన్ఐఏ పేర్కొంది. అలాగే, మసూద్ సోదరుడు అబ్దుల్ రౌఫ్, మరో ఇద్దరని కూడా ఈ చార్జిషీటులో చేర్చింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో కీలక భారత రక్షణ స్థావరమైన ఎయిర్ బేస్ పై పాక్ కు చెందిన ముష్కరులు అనూహ్యంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మసూద్, అతడి సోదరుడు, మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, పేలుళ్లకు సంబంధించిన చట్టాలు, పబ్లిక్ ప్రాపర్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమెరికా కూడా కీలక సహాయం అందించింది. ఉగ్రవాదులు జరిపిన సంభాషణలు, ఈమెయిల్స్ వంటివాటిని అమెరికా సహాయంతో గుర్తించారు.