లక్నో : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ప్రచారంలో భాగంగా పార్టీలన్ని ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షహరాన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఉగ్ర సంస్థ జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అల్లుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షహరాన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. షహరాన్‌పూర్‌లో ఉగ్రవాది మసూద్ అజహర్ తరఫున మాట్లాడే వ్యక్తి(కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్) గెలవాలో.. లేక మోదీ సైనికుడు విజయం సాధించాలో మీరే నిర్ణయించుకొండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే.. మోదీ ప్రభుత్వం వారి చేత బెల్లెట్లు, బాంబులను తినిపించిందని యోగి పేర్కొన్నారు. అంతేకాక అత్యంత కిరాతక ఉగ్రవాదిగా పేరు గాంచిన ఒసామా బిన్ లాడెన్‌కు ఏ గతి పట్టిందో.. మసూద్ అజహర్‌కు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక యూపీలో ఎస్పీ - బీఎస్పీ కూటమిని ఉద్దేశిస్తూ 37 - 38 స్థానాల్లో పోటీ చేసేవారు ప్రధాని కావాలని ఆశిస్తున్నారంటూ చురకలంటించారు. ఇదే వేదిక మీదుగా రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాలపై కూడా విమర్శల వర్షం కురిపించారు.
‘రాహుల్ గాంధీకి భారతీయ సంస్కృతి గురించి ఏ మాత్రం తెలీదు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించినప్పుడు నమాజ్‌కు ఎలా కూర్చుంటారో రాహుల్ ఆలయంలో అలా కూర్చున్నార’ని ఆరోపించారు. ‘ఇక కాంగ్రెస్‌లో ఓ మహాగురు ఉన్నారు. మన సాయుధ బలగాల త్యాగాన్ని ప్రశ్నించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారం’టూ శామ్ పిట్రోడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment