Imran Masood
-
సహరాన్పూర్ కిరీటం ఎవరికి?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఈసారి కూడా సహరాన్పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి శాకాంబరి దేవాలయంలో పూజలు చేసి ఆయన తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. నాటి ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లకుగాను బీజేపీ 325 సీట్లకు గెలుచుకుంది. ఇప్పుడు మరో రకంగా కూడా ఈ సహరాన్పూర్ నియోజక వర్గానికి ప్రాధాన్యత చేకూరింది. ఈ నియోజకవర్గంలో 42 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమ్రాన్ మసూద్, నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ హెచ్చరించడం నాడు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఫలితంగా నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ మసూద్‌పై బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్ 65 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వారిద్దరు మరోసారి పోటీ పడుతున్నారు. అయితే వారిపై పోటీ చేసేందుకు మూడోవ్యక్తి బరిలోకి దిగారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి పోటీ చేయాలి. ప్రముఖ ముస్లిం నాయకుడు ఫజ్లూరు రహమాన్‌ను మాయావతి రంగంలోకి దింపారు. ఇద్దరు ముస్లిం నాయకులు తలపడుతున్న కారణంగా ముస్లిం ఓట్లు చీలిపోయి బీజేపీ అభ్యర్థి లఖన్‌పాల్ సులభంగా గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింలు తెలివిగా ఒక్క బీఎస్పీ అభ్యర్థి రహమాన్‌కే మద్దతిచ్చినట్లయితే ఆయనే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని కూడా వారంటున్నారు. ఇద్దరికి ముస్లింలలో బలం ఉంది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశలోనే ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. -
‘అతను ఉగ్రవాది మసూద్ అజహర్ అల్లుడు’
లక్నో : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ప్రచారంలో భాగంగా పార్టీలన్ని ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షహరాన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఉగ్ర సంస్థ జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అల్లుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షహరాన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. షహరాన్‌పూర్‌లో ఉగ్రవాది మసూద్ అజహర్ తరఫున మాట్లాడే వ్యక్తి(కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్) గెలవాలో.. లేక మోదీ సైనికుడు విజయం సాధించాలో మీరే నిర్ణయించుకొండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే.. మోదీ ప్రభుత్వం వారి చేత బెల్లెట్లు, బాంబులను తినిపించిందని యోగి పేర్కొన్నారు. అంతేకాక అత్యంత కిరాతక ఉగ్రవాదిగా పేరు గాంచిన ఒసామా బిన్ లాడెన్‌కు ఏ గతి పట్టిందో.. మసూద్ అజహర్‌కు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక యూపీలో ఎస్పీ - బీఎస్పీ కూటమిని ఉద్దేశిస్తూ 37 - 38 స్థానాల్లో పోటీ చేసేవారు ప్రధాని కావాలని ఆశిస్తున్నారంటూ చురకలంటించారు. ఇదే వేదిక మీదుగా రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాలపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ‘రాహుల్ గాంధీకి భారతీయ సంస్కృతి గురించి ఏ మాత్రం తెలీదు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించినప్పుడు నమాజ్‌కు ఎలా కూర్చుంటారో రాహుల్ ఆలయంలో అలా కూర్చున్నార’ని ఆరోపించారు. ‘ఇక కాంగ్రెస్‌లో ఓ మహాగురు ఉన్నారు. మన సాయుధ బలగాల త్యాగాన్ని ప్రశ్నించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారం’టూ శామ్ పిట్రోడాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇమ్రాన్ మసూద్ అరెస్ట్
సహరాన్పూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలుగా నరుకుతానంటూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇమ్రాన్ మసూద్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. మసూద్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మోడీని ముక్కలుగా నరికేస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన ప్రసంగం శుక్రవారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన దియోబంద్ పోలీసులు శనివారం తెల్లవారుజామున ఇమ్రాన్ మసూద్‌ను అరెస్టు చేశారు. ఆయనను దియోబంద్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అర్చనా రాణి ఎదుట హాజరుపర్చగా... 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు. మసూద్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్.. విద్వేష ప్రసంగం చేసిన ఇమ్రాన్ మసూద్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. ‘‘ఆ ప్రసంగాన్ని 2013 సెప్టెంబర్ 18న సెల్‌ఫోన్‌తో రికార్డు చేశారు. అప్పుడు ఇమ్రాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న మసూద్ కాంగ్రెస్‌లో చేరారు. యూపీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలవి. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం పార్టీ నిబంధనలకు లోబడి ఉన్నారు. ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. పార్టీలో చేరకముందు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెలా చర్య తీసుకోగలం’’ అని యూపీ పీసీసీ సమాచార విభాగం చైర్మన్ సత్యదేవ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో శుక్రవారం క్షమాపణ చెప్పిన ఇమ్రాన్ మసూద్.. శనివారం అరెస్టు అనంతరం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘‘నేనేం తప్పు చేయలేదు. బీజేపీకిగానీ, మోడీకిగాని క్షమాపణ చెప్పను. వందసార్లు జైలుకు వెళ్లడానికి సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
24 గంటల్లో హీరో నుంచి జీరోకి
ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో దిగిన ఇమ్రాన్ మసూద్ కథ సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో ఊహించని మలుపు తిరిగింది. ఆవేశపూరిత ప్రసంగాలు, కత్తికో కండగా ముక్కలు ముక్కలుగా నరుకుతానన్న ప్రగల్భాలు శుక్రవారం ఆయన్ని ముస్లిం ఓటర్లలో హీరోగా నిలబెట్టి ఉండొచ్చు. కానీ శనివారం సూర్యుడు నిద్రలేచే సరికి ఆయన పై కేసు పెట్టారు. కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయనను రిమాండ్ కి పంపించారు. హడావిడిగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన ఇమ్రాన్ మసూద్ ఇప్పుడు తాపీగా ఊచలు లెక్కబెట్టుకుంటున్నారు. ఇంకా విషాదం ఏమిటంటే ఆయనకు అనుకూలంగా ఒక్కరూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇలాంటి వారిని పార్టీలో ఉంచకూడదు అన్నారు. రాహుల్ గాంధీ ఈ భాషను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించలేమని అన్నారు. రాహుల్ గాంధీ అయితే సహారన్ పూర్ లో శనివారం బహిరంగ సభనే రద్దు చేసుకున్నారు. దీంతో కాంగ్రెసీయులు మసూద్ ను పూర్తిగా వదిలేశారు. ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్లు నరేంద్ర మోడీకి లాభం చేకూరుస్తాయన్నది కాంగ్రెస్ అధిష్ఠానానికి బాగా తెలుసు. గతంలో మోడీని సోనియా గాంధీ 'మౌత్ కా సౌదాగర్' అని విమర్శించింది. మోడీ దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయఢంకా మోగించాడు. అందుకే కాంగ్రెస్ మసూద్ ను ఏ మాత్రమూ వెనకేసుకురావడానికి ప్రయత్నించలేదు. -
మోడీని నరికేస్తానన్న మసూద్ అరెస్ట్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సహరాన్ పూర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌ను శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ సహరన్‌పూర్‌లో శుక్రవారం ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... యూపీని గుజరాత్‌లా తీర్చిదిద్దుతానంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీని గుజరాత్‌లా చేసేందుకు మోడీ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆయన్ను ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వ్యాఖ్యానించారు. తాను చావడానికే కాదు చంపడానికైనా సిద్ధమన్నారు. తన ప్రజలకోసం ప్రాణాలివ్వడానికీ సిద్ధమన్నారు. తుది శ్వాస వరకు మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ను మోడీ గుజరాత్ చేస్తానంటున్నారు... కానీ గుజరాత్లో ముస్లిం జనాభా కేవలం నాలుగుశాతమే...కానీ మన రాష్ట్రంలో ముస్లింల జనాభా 42 శాతంగా ఉందని మసూద్ గుర్తు చేశారు. మసూద్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది.మసూద్ వ్యాఖ్యలను ఖండించింది. మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ డిమాండ్ చేసింది. దాంతో మసూద్‌పై సహరన్పూర్ జిల్లాలోని దేవ్‌బాంద్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125వ సెక్షన్, ఐపీసీకి చెందిన 153ఎ, 295 ఎ, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు యూపీ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్‌ను ఆయన నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటలకు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు సహరాన్ పూర్ ర్యాలీకి హాజరై ప్రసంగించవలసి ఉంది. అయితే మసూద్ అరెస్ట్ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహరాన్ పూర్ పర్యటన రద్దు అయింది. -
మోడీని ముక్కలుగా నరికేస్తా
-
మోడీని ముక్కలుగా నరికేస్తా
యూపీ కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆనక క్షమాపణ లక్నో/న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ముక్కలు ముక్కలుగా తెగ నరుకుతానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు మసూద్‌పై కేసు నమోదుకు దారితీశాయి. దీనిపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలను ఖండించింది. మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ సహరన్‌పూర్‌లో శుక్రవారం ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... యూపీని గుజరాత్‌లా తీర్చిదిద్దుతానంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీని గుజరాత్‌లా చేసేందుకు మోడీ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆయన్ను ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వ్యాఖ్యానించారు. తాను చావడానికి లేదా చంపడానికి వెనుకాడబోనన్నారు. తన ప్రజలకోసం ప్రాణాలివ్వడానికీ సిద్ధమన్నారు. ‘‘మోడీకి వ్యతిరేకంగా పోరాడతా. ఆయన(మోడీ) దీనిని(యూపీని) గుజరాత్ చేస్తానంటున్నారు. కానీ గుజరాత్లో ముస్లిం జనాభా కేవలం నాలుగుశాతమే. యూపీలో ముస్లింల జనాభా 42 శాతంగా ఉంది’’ అని మసూద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించడంతో ఆనక తప్పైపోయిందంటూ తన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పారు. ఇందుకు చింతిస్తున్నానన్నారు. మసూద్‌పై కేసు: ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మసూద్‌పై సహరన్పూర్ జిల్లాలోని దేవ్‌బాంద్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125వ సెక్షన్, ఐపీసీకి చెందిన 153ఎ, 295 ఎ, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు యూపీ ఐజీపీ తెలిపారు. సమర్థించట్లేదు: కాంగ్రెస్ మసూద్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించబోదని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జివాలా స్పష్టం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా సహనం వహించాలని తమ పార్టీ సభ్యులకు రాహుల్‌గాంధీ సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై మసూద్ నుంచి వివరణ కోరగా.. తన వ్యాఖ్యలను వక్రీకరించి నట్టు ఆయన చెప్పారని సూర్జివాలా వివరించారు.