బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ముక్కలు ముక్కలుగా తెగ నరుకుతానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి.
యూపీ కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆనక క్షమాపణ
లక్నో/న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ముక్కలు ముక్కలుగా తెగ నరుకుతానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు మసూద్‌పై కేసు నమోదుకు దారితీశాయి. దీనిపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలను ఖండించింది. మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ సహరన్‌పూర్‌లో శుక్రవారం ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... యూపీని గుజరాత్‌లా తీర్చిదిద్దుతానంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీని గుజరాత్‌లా చేసేందుకు మోడీ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆయన్ను ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వ్యాఖ్యానించారు. తాను చావడానికి లేదా చంపడానికి వెనుకాడబోనన్నారు. తన ప్రజలకోసం ప్రాణాలివ్వడానికీ సిద్ధమన్నారు. ‘‘మోడీకి వ్యతిరేకంగా పోరాడతా. ఆయన(మోడీ) దీనిని(యూపీని) గుజరాత్ చేస్తానంటున్నారు. కానీ గుజరాత్‌లో ముస్లిం జనాభా కేవలం నాలుగుశాతమే. యూపీలో ముస్లింల జనాభా 42 శాతంగా ఉంది’’ అని మసూద్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించడంతో ఆనక తప్పైపోయిందంటూ తన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పారు. ఇందుకు చింతిస్తున్నానన్నారు.
మసూద్‌పై కేసు: ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మసూద్‌పై సహరన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బాంద్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125వ సెక్షన్, ఐపీసీకి చెందిన 153ఎ, 295 ఎ, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు యూపీ ఐజీపీ తెలిపారు.
సమర్థించట్లేదు: కాంగ్రెస్
మసూద్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించబోదని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జివాలా స్పష్టం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా సహనం వహించాలని తమ పార్టీ సభ్యులకు రాహుల్‌గాంధీ సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై మసూద్ నుంచి వివరణ కోరగా.. తన వ్యాఖ్యలను వక్రీకరించి నట్టు ఆయన చెప్పారని సూర్జివాలా వివరించారు.