ఇమ్రాన్ మసూద్ అరెస్ట్
సహరాన్‌పూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలుగా నరుకుతానంటూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇమ్రాన్ మసూద్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. మసూద్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
మోడీని ముక్కలుగా నరికేస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన ప్రసంగం శుక్రవారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన దియోబంద్ పోలీసులు శనివారం తెల్లవారుజామున ఇమ్రాన్ మసూద్‌ను అరెస్టు చేశారు. ఆయనను దియోబంద్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అర్చనా రాణి ఎదుట హాజరుపర్చగా... 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు.
మసూద్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్..
విద్వేష ప్రసంగం చేసిన ఇమ్రాన్ మసూద్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. ‘‘ఆ ప్రసంగాన్ని 2013 సెప్టెంబర్ 18న సెల్‌ఫోన్‌తో రికార్డు చేశారు. అప్పుడు ఇమ్రాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న మసూద్ కాంగ్రెస్‌లో చేరారు. యూపీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలవి. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం పార్టీ నిబంధనలకు లోబడి ఉన్నారు.
ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. పార్టీలో చేరకముందు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెలా చర్య తీసుకోగలం’’ అని యూపీ పీసీసీ సమాచార విభాగం చైర్మన్ సత్యదేవ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో శుక్రవారం క్షమాపణ చెప్పిన ఇమ్రాన్ మసూద్.. శనివారం అరెస్టు అనంతరం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘‘నేనేం తప్పు చేయలేదు. బీజేపీకిగానీ, మోడీకిగాని క్షమాపణ చెప్పను. వందసార్లు జైలుకు వెళ్లడానికి సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.