సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఈసారి కూడా సహరాన్‌పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి శాకాంబరి దేవాలయంలో పూజలు చేసి ఆయన తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. నాటి ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లకుగాను బీజేపీ 325 సీట్లకు గెలుచుకుంది.
ఇప్పుడు మరో రకంగా కూడా ఈ సహరాన్‌పూర్ నియోజక వర్గానికి ప్రాధాన్యత చేకూరింది. ఈ నియోజకవర్గంలో 42 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమ్రాన్ మసూద్, నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ హెచ్చరించడం నాడు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఫలితంగా నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ మసూద్‌పై బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్ 65 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వారిద్దరు మరోసారి పోటీ పడుతున్నారు.
అయితే వారిపై పోటీ చేసేందుకు మూడోవ్యక్తి బరిలోకి దిగారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి పోటీ చేయాలి. ప్రముఖ ముస్లిం నాయకుడు ఫజ్లూరు రహమాన్‌ను మాయావతి రంగంలోకి దింపారు. ఇద్దరు ముస్లిం నాయకులు తలపడుతున్న కారణంగా ముస్లిం ఓట్లు చీలిపోయి బీజేపీ అభ్యర్థి లఖన్‌పాల్ సులభంగా గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింలు తెలివిగా ఒక్క బీఎస్పీ అభ్యర్థి రహమాన్‌కే మద్దతిచ్చినట్లయితే ఆయనే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని కూడా వారంటున్నారు. ఇద్దరికి ముస్లింలలో బలం ఉంది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశలోనే ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment