మోడీని నరికేస్తానన్న మసూద్ అరెస్ట్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సహరాన్ పూర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ను శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ సహరన్‌పూర్‌లో శుక్రవారం ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... యూపీని గుజరాత్‌లా తీర్చిదిద్దుతానంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీని గుజరాత్‌లా చేసేందుకు మోడీ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆయన్ను ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వ్యాఖ్యానించారు. తాను చావడానికే కాదు చంపడానికైనా సిద్ధమన్నారు. తన ప్రజలకోసం ప్రాణాలివ్వడానికీ సిద్ధమన్నారు. తుది శ్వాస వరకు మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ను మోడీ గుజరాత్ చేస్తానంటున్నారు... కానీ గుజరాత్‌లో ముస్లిం జనాభా కేవలం నాలుగుశాతమే...కానీ మన రాష్ట్రంలో ముస్లింల జనాభా 42 శాతంగా ఉందని మసూద్ గుర్తు చేశారు. మసూద్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది.మసూద్ వ్యాఖ్యలను ఖండించింది. మసూద్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ డిమాండ్ చేసింది. దాంతో మసూద్పై సహరన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బాంద్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125వ సెక్షన్, ఐపీసీకి చెందిన 153ఎ, 295 ఎ, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు యూపీ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ను ఆయన నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటలకు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు సహరాన్ పూర్ ర్యాలీకి హాజరై ప్రసంగించవలసి ఉంది. అయితే మసూద్ అరెస్ట్ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహరాన్ పూర్ పర్యటన రద్దు అయింది.